అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | ఓటర్ అర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయంతో కేంద్ర ఎన్నికల సంఘం విభేదించింది. ఓటర్ అర్హతకు ఆధార్, ఓటర్ గుర్తింపు, రేషన్ కార్డులను రుజువుగా తీసుకోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది. పౌరసత్వ రుజువును డిమాండ్ చేసే రాజ్యాంగ అధికారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను సమర్థించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission).. ఆధార్, ఓటరు గుర్తింపు లేదా రేషన్ కార్డులను ఓటరు అర్హతకు రుజువుగా అంగీకరించలేమని పేర్కొంది. బీహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను సవాల్ చేస్తూ పలు పార్టీలు, సంఘాలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆధార్(Aadhar), రేషన్ కార్డు(Ration Cards)లతో పాటు ఓటర్ ఐడీ(Voter ID)లను ఓటర్ జాబితాలో చేర్చడానికి అర్హతగా, రుజువుగా భావించాలని ఈసీకి సూచించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఈసీ సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్ దాఖలు చేసింది.
Election Commission | ఈసీకి సంపూర్ణ అధికారులు..
ఓటర్ జాబితాల రూపకల్పన సహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగం ఎన్నికల సంఘానికి సంపూర్ణ అధికారులు కల్పించిందని ఈసీ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(Article 324) ప్రకారం ఎన్నికల జాబితాల తయారీతో సహా ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను పర్యవేక్షించడానికి, దర్శకత్వం వహించడానికి పూర్తి అధికారాన్ని కలిగి ఉందని తెలిపింది. ఆర్టికల్ 326 కింద సూచించిన విధంగా భారత పౌరసత్వం ఆవశ్యకతతో సహా ఓటరు అర్హతను పరిశీలించడానికి కమిషన్‌కు అధికారం ఉందని ఎన్నికల సంఘం వాదించింది. ఓటరు నమోదు కోసం పౌరసత్వాన్ని నిరూపించడంలో విఫలమవడం ఒకరి పౌరసత్వాన్ని రద్దు చేయడమే కాదని పేర్కొంది.
Election Commission | స్వచ్ఛమైన ఓటార్ జాబితాల కోసమే..
1955 పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పౌరసత్వాన్ని నిర్ణయించగలదనే పిటిషనర్ల వాదనను ఈసీ తోసిపుచ్చింది. ఈ వివరణ “చాలా తప్పు” అని, దాని రాజ్యాంగ, చట్టబద్ధమైన విధులను విస్మరిస్తుందని ECI వాదించింది. “సెక్షన్ 9 కింద కేంద్ర ప్రభుత్వానికి(Central Government) ఉన్న ప్రత్యేక అధికారాలు విదేశీ పౌరసత్వాన్ని పొందడాన్ని సమీక్షించడానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. పుట్టుకతో పౌరసత్వం పొందే వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి సంబంధిత పత్రాలను సమర్పించాలని ECI పూర్తిగా సమర్థతను కలిగి ఉంది” అని అఫిడవిట్ పేర్కొంది. ఆర్టికల్ 324 నుంచి మాత్రమే కాకుండా, ఆర్టికల్ 326చ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 (RP చట్టం) లోని సెక్షన్లు 16, 19 నుంచి కూడా తమకు అధికారాలు దాఖలు పడ్డాయని తెలిపింది. ఇది వయస్సు, సాధారణ నివాసం, భారత పౌరసత్వం ప్రమాణాలను తీర్చే అర్హత కలిగిన పౌరులను మాత్రమే జాబితాలో చేర్చాల్సిన బాధ్యతను కలిగి ఉందని పేర్కొంది. “ఆర్టికల్ 326 కింద అర్హత లేకపోవడం పౌరసత్వాన్ని రద్దు చేయడానికి దారితీయదు” అని తెలిపింది. అయితే, ప్రత్యేక ఇంటిన్సివ్ రివిజన్ అనేది స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలకు రూపకల్పన చేయడమే లక్ష్యంగా చేపట్టినట్లు స్పష్టం చేసింది.