అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jagdeep Dhankhad | ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ దేశ రాజకీయాల్లో కలకలం రేపారు. అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలిగిన ఆయన కొత్త చర్చకు తెర లేపారు. వివిధ హోదాల్లో పని చేసిన ధన్‌ఖడ్(Jagdeep Dhankhad) ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏడు పదుల వయస్సులోనూ నిక్కచ్చిగా, నిజాయతీగా వ్యవహరించారు. ఉప రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీకాలంలో కీలకంగా వ్యవహరించారు. ఏ పార్టీ అయినా తప్పును తప్పుగానే ఎత్తిచూపారు. ఒకానొక దశలో కేంద్రంతో విభేదించారు. అలాగే, విపక్ష పార్టీలను సైతం ఆయన తూర్పారబట్టారు. ఇక, న్యాయవ్యవస్థతోనూ తలపడ్డారు. అభిశంసనను ఎదుర్కొన్న ఉప రాష్ట్రపతిగా చరిత్రకెక్కిన ధన్‌ఖడ్.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆయన వారసుడిగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ (Rajya Sabha Deputy Chairman Harivansh)కు అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది.
Jagdeep Dhankhad | సంచలనాలకు మారుపేరు..
గవర్నర్‌గా, ఉప రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పని చేసిన ధన్‌ఖడ్.. అనేక సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benarjee)తో నేరుగానే తలపడ్డారు. సై అంటే సై అని ఆమెకు ఎదురు నిలిచారు. ఇక, న్యాయ వ్యవస్థతోనూ తలపడ్డారు. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్‌ఖడ్.. విపక్ష పార్టీలకు కొరకి రాని కొయ్యగా మారారు. 2022 నుండి 2025 వరకు భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్.. తరచూ ప్రతిపక్షాలతో ఘర్షణలకు దిగారన్న భావన నెలకొంది. ఆగస్టు 2022లో రాజ్యసభ ఛైర్మన్‌గా నియమితులైన ధన్‌ఖడ్.. తన పదవీకాలం అనేక రాజకీయ వివాదాలకు తెర లేపారు. ముఖ్యంగా ఆయన బహిరంగంగా మాట్లాడే అభిప్రాయాలు, పార్లమెంటరీ(Parliamentary) కార్యకలాపాలపై నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీలతో ఘర్షణలు సంచలనం రేపాయి.
Jagdeep Dhankhad | న్యాయవ్యవస్థపై అసహనం..
ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జగదీప్ ధన్‌ఖడ్.. న్యాయ వ్యవస్థ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అపరిమిత అధికారాలు కలిగి ఉండడంపై అభ్యంతరం తెలిపారు. జనవరి 2023లో.. సుప్రీంకోర్టు(Supreme Court) ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలను న్యాయవ్యవస్థ రద్దు చేస్తే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగిస్తుందన్నారు. ఇది అధికార పరిధిని అతిక్రమించడమేనని, శాసన వ్యవస్థలోకి చొరబడమేనని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మరోవైపు, బిల్లుల ఆమోదానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతికి గడువు విధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
Jagdeep Dhankhad | విపక్షాలపై ఎదురుదాడి..
రాజ్యసభ అధ్యక్షుడిగా ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపణలున్నాయి. కొన్ని అంశాలపై ఆయన ప్రతిపక్షాలతో నేరుగానే తలపడ్డారు. సభ సమావేశాలను బహిష్కరిస్తున్న వారిపై ధన్‌ఖడ్ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. కొందరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని రాజద్రోహం కింద విచారించాలని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ తమ గొంతులను అణిచివేస్తున్నారని, పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో బీజేపీ ఎంపీ(BJP MP)లకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై గతేడాది డిసెంబర్‌లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి.
Jagdeep Dhankhad | వివాదాలకు కేంద్ర బిందువుగా..
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) లకు మద్దతు ఇచ్చిన ధన్‌ఖడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయా సంస్థలను ప్రశ్నించడం న్యాయ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి రాజకీయాలు, విశ్వవిద్యాలయ క్యాంపస్‌లపై ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు దేశ వ్యతిరేక భావజాలాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు.