అక్షరటుడే, వెబ్‌డెస్క్: Masa Shivaratri : హిందూ(Hindu) సంప్రదాయంలో ఏడాది మొత్తం పండుగలు, ప్రత్యేక రోజులు వస్తుంటాయి. వాటిలో ప్రతినెల అమావాస్య(Amavasya)కు ముందు వచ్చే రోజుకు మరింత ప్రత్యేకత ఉంది.
ఇది పరమేశ్వరుడికి సంబంధించిన రోజు. ఈ తిథి నాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడినట్లు శివ పురాణం(Shiva puranam) చెబుతోంది. ఈ తిథి నాడే శివుడు అవతరించాడనే కథా ప్రాచుర్యంలో ఉంది.
అందుకే ప్రతినెల అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి(Shiva rathri)గా నిర్వహించుకుంటారు. దీనిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. కాగా 12 శివరాత్రులలో మాఘ మాసంలో వచ్చే శివరాత్రికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. దానిని మహాశివరాత్రి(Maha Shivarathri)గానూ పేర్కొంటారు.
మరొక పురాణం ప్రకారం.. మాస శివరాత్రి రోజున సముద్ర మథనం ప్రారంభం అయిందని చెబుతారు. ఈ రోజు నుంచి దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం ప్రారంభించినందున పర్వదినంగా నిర్వహించుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది.
శివరాత్రికి సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమావాస్యకు ముందు వచ్చే రోజు ఒకసారి మహాశివుడికి కోపం వచ్చిందట. దీంతో ఆయన కోపాగ్నితో ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడిందంటారు. అప్పుడు పార్వతి దేవి(Parvathi Devi) శివుడిని స్తుతించి ప్రసన్నం చేసుకోవడంతో ఆయన కోపం చల్లారిందంటారు.
ఈ నమ్మకం కారణంగా ప్రతినెల కృష్ణ పక్ష చతుర్థి రోజున మాస శివరాత్రి నిర్వహించుకుంటారు. మాస శివరాత్రిని మోక్షాన్ని పొందే అవకాశంగా భావిస్తారు. ఈ రోజున శివుడిని పూజించినవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
Masa Shivaratri : ఉపవాసం అందుకే..
పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజున ఉపవాసం(Fasting) ఉండి, శివుడిని ప్రదోష వేళ పూజిస్తారు. దీనివెనుక కారణం లేకపోలేదు.
అమావాస్యకు ముందు కేతువు(Kethu) ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. దీంతో భూమి మీద ఉన్న జీవులపైన కేతువు ప్రభావం పడుతుంది. ఆహారంపైన కూడా ప్రభావం పడి జీర్ణశక్తి(Digestion power) మందగిస్తుంది.
అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని పెద్దలు సూచిస్తుంటారు. పరమేశ్వరుడిని పూజిస్తే రాహుకేతు(Rahu Kethu) గ్రహదోషాలూ పోతాయని, సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం ఉంది. అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పేర్కొంటారు.