అక్షరటుడే, వెబ్‌డెస్క్: Betting Apps | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులోకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎంటర్ కావడంతో స్పీడ్ పెరిగింది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్లకు సంబంధించి టాలీవుడ్ హీరోలు (Tollywood heroes) విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలతో (Daggubati Rana) పాటు మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి సహా 29మంది సెలెబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
చట్టవిరుద్ధ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని, అందుకుగాను వారు భారీగా కమీషన్, పారితోషికం తీసుకున్నారంటూ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యాప్‌ల వలన అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ FIR లో పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయగా.. రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ వంటి నటులకు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఈ నెల 23న రానా, 30న ప్రకాశ్ రాజ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ పేర్కొంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు దగ్గుబాటి రానాతో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రకాశ్‌రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్ (Nidhi Agarwal), శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ (Vishnu Priya), వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వారితో పాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. వీరితో పాటు ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన మెటా, గూగుల్ సంస్థలకు కూడా ఈడీ నోటీసులు పంపించడం గమనార్హం.