అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President Dhankhar | దేశ అంతర్గత విషయాల్లో భారత్‌ను బయటి శక్తి ఏది కూడా నియంత్రించలేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Vice President Jagdeep Dhankhar) అన్నారు. తన ఒత్తిడి వల్లే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటనలు చేస్తున్న తరుణంలో ధన్‌ఖడ్ ఈ విధంగా స్పందించారు.
భారతదేశాన్ని ఏ బాహ్య శక్తి ఆదేశించలేదని స్పష్టం చేశారు. వివిధ వార్తలు, ప్రచారాల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టకూడదన్నారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (Indian Defence Estates Service) 2024 బ్యాచ్ ఆఫీసర్ ట్రెయినీలను ఉద్దేశించి ప్రసంగించిన ఉప రాష్ట్రపతి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. “బయటి కథనాల ద్వారా మార్గనిర్దేశం చేయవద్దు. భారత్ సార్వభౌమ దేశం. ఈ దేశంలోని అన్ని నిర్ణయాలను ఇక్కడి నాయకత్వమే తీసుకుంటుంది. తన వ్యవహారాలను ఎలా నిర్వహించాలో నిర్దేశించడానికి ఈ గ్రహం మీద ఏ శక్తి లేదని” తేల్చి చెప్పారు.
Vice President Dhankhar | చెత్త బంతులను వదిలేయాలి..
ట్రంప్ చేస్తున్న ప్రకటనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలోనూ క్రికెట్‌ను ఉదాహరిస్తూ ధన్‌ఖడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి బ్యాట్స్‌మెన్ ప్రతీ బంతిని ఆడడని, చెత్త బంతులను వదిలేస్తాడని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఘర్షణను నివారించడనాకి అమెరికా కీలక పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) పదేపదే చేస్తున్న ప్రకటనలపై ప్రతిపక్షాలు స్పష్టత కోరుతున్న తరుణంలో ధన్‌ఖడ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ప్రతి బంతిని ఆడటం’ అవసరమా ? అని పరోక్షంగా ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించిన ఆయన.. మంచి ఆటగాళ్లు తరచూ చెడు డెలివరీలను వదిలివేస్తారన్నారు. “ప్రతి చెడు బంతిని ఆడటం అవసరమా? ఎవరు ఏమి చెప్పారో తెలుసుకోవడానికి రెజ్లింగ్ సెషన్‌లు అవసరమా? క్రికెట్ పిచ్‌లో మంచి పరుగులు చేసిన వ్యక్తి ఎల్లప్పుడూ చెడు బంతులను వదిలివేస్తాడని” అని తెలిపారు.