అక్షరటుడే, వెబ్‌డెస్క్: Good Sleep | నిద్ర అనేది శరీరానికి చాలా ముఖ్యం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, పౌష్టికాహారం (Nutrition food) ఎంత అవసరమో.. కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం.
రాత్రి నిద్ర సరిగా పోకపోతే మరుసటి రోజు నిద్రమత్తు ఉంటుంది. చిరాకుగా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇలా ఒకరోజో, రెండు రోజులో కాదు.. చాలా రోజులు నిద్రలేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. సరైన నిద్ర లేకపోతే మెదడు కూడా సరిగా పనిచేయదు. చిరాకు, కోపం, ఆందోళన పెరుగుతాయి. అజీర్ణం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, బీపీ(BP), ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలు వస్తాయి. ఇలా చాలా అనారోగ్య సమస్యలు మన దరి చేరతాయి.
అందుకే నిద్రలేమి(Sleep deprivation) రోగాల కొలిమి అని అంటారు. నిద్ర సరిగా పట్టకపోవడాన్ని నిద్ర లేమి లేదా ఇన్సోమ్నియా (Insomnia) అని పిలుస్తారు. ఈ సమస్యకు యోగా(Yoga)తో చెక్ చెప్పవచ్చని పేర్కొంటున్నారు యోగా గురువులు. యోగా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, నిద్రతోనే శరీరం రిలాక్స్(Relax) అవుతుంది కాబట్టి నిద్ర లేమి సమస్యతో బాధ పడేవారు ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. మంచి నిద్రకోసం వేయాల్సిన ఆసనాలేమిటో తెలుసుకుందామా..
పద్మాసనం(Padmasana) లేదా ఏదైనా స్థిర ఆసనంలో కూర్చొని రోజూ పదినుంచి పదిహేను సార్లు(5 నిమిషాలు) దీర్ఘ శ్వాసక్రియ చేయాలి. సూర్య నమస్కారాలు సాధన చేయాలి. మకరాసనం వేయాలి. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. మనస్సు కూడా ప్రశాతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.
విపరీత కరణి(Viparita Karani) చేయాలి. ఈ ఆసనం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి, అలసట దూరమవుతుంది.
బద్ధకోణాసనం(Baddha Konasana) వేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సేతు బంధాసనం, భుజంగాసనాలు శ్వాసను మెరుగుపరుస్తాయి. పశ్చిమోత్తనాసనం (Paschimottanasana) వెన్నునొప్పిని తగ్గించి, నిద్రకు సహాయపడుతుంది.
జాను శీర్షాసనం(Janu Sirsasana) వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. కండరాలను సాగదీస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శవాసనం (Savasana) ఒక విశ్రాంతి ఆసనం. దీని ద్వారా శరీరం, మనసు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. రోజూ ధ్యానం చేయడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నిత్యం భ్రామరీ ప్రాణాయామం (Bhramari Pranayamaa) సాధన చేయాలి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
యోగ నిద్ర (Yoga nidra).. శరీరం, మనస్సు లోతుగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.