అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arunachalam | అరుణాచల క్షేత్రానికి (Arunachalam ) నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తారు. గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని తరిస్తారు.
అయితే అరుణాచలం వెళ్లే వారిలో చాలా మంది తెలుగు రాష్ట్రాలే (Telugu States) వారే ఉంటారు. ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు దేశం నలుమూలల నుంచి అరుణాచలానికి భక్తులు పోటెత్తుతారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సొంత వాహనాలు, ట్యాక్సీలు, రైళ్ళు, బస్సుల్లో వేలాది మంది గిరి ప్రదక్షిణకు వెళ్తుంటారు.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో ప్రతి పౌర్ణమికి లక్షలాది భక్తులు ఆలయానికి వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం భారీగా భక్తులు వెళ్తుంటారు. చాలా ఆర్టీసీ డీపోలు ప్రతి పౌర్ణమికి అరుణాచలం ఆలయానికి ప్రత్యేక బస్సులు (Special Buses) సైతం నడుపుతున్నాయి.
Arunachalam | తెలుగు భక్తులపై వివక్ష
అరుణాచలంలో తెలుగు భక్తుల (Telugu Devotees)పై వివక్ష చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. చాలా రోజులుగా ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. యావత్ దేశం నుంచి భక్తులు వస్తుంటే కేవలం తమిళంలో మాత్రమే అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇతర భక్తులను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆలయంతో పాటు అక్కడ ఉండే స్థానికులు సైతం తెలుగువారిపై వివక్ష చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల యాదాద్రి (Yadadri) జిల్లాకు చెందిన ఓ భక్తుడిని గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో డబ్బుల కోసం ఇద్దరు హత్య చేసిన విషయం తెలిసిందే. అలాగే చాలా మంది భక్తులను దర్శనాల పేరిట మోసం చేస్తున్నట్లు సమాచారం.
Arunachalam | వీడియో వైరల్
అరుణాచలంలో భక్తుల కష్టాలకు సంబంధించి ఓ యువకుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. భక్తులను పట్టించుకోవడం లేదని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించాడు. అంతేగాకుండా తమిళంలో ప్రకటనలు చేస్తున్నారని.. అవి అర్థం కాక ఇతర రాష్ట్రాల భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఐదారు గంటల పాటు దర్శనం కోసం క్యూలైన్లో ఉన్న తర్వాత తమను బయటకు పంపారని ఆరోపించారు. భక్తులు ఆలయ హుండీల్లో డబ్బులు వేయడం ఆపాలని కోరారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలుగు భక్తులపై వివక్ష ఉన్నది వాస్తవమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అరుణాచలంను సందర్శించడం, నిధులు ఇవ్వడం ఆపాలని కోరుతున్నారు. అలా చేయడంతో అక్కడి ప్రభుత్వానికి తెలుగు భక్తులు బలం తెలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించాలని సూచిస్తున్నారు.