అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల సిగాచి పరిశ్రమ (Sigachi Factory)లో పేలుడు చోటుసుకున్న ఘటన మరువక ముందే ఆదివారం ఉదయం ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.
ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro Waste Management) పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. మంటల్లో జేసీబీ, లారీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.
Pashamylaram | ఆందోళనలో కార్మికులు
పరిశ్రమల్లో వరుస ఘటనలతో కార్మికులు, పాశమైలారం వాసులు ఆందోళన చెందుతున్నారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 43 మంది మృతి చెందారు. మరో ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారు కూడా చనిపోయి ఉంటారని అధికారులు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున, సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాయి.
ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.