అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bonalu Festival | భాగ్యనగరంలో బోనాల సందడి (Bonalu Festival) నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. జూన్ 26న గోల్కొండలో జగందాబిక అమ్మవారికి బోనాలు (Golconda Bonalu) సమర్పించడంతో పండుగ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahakali) అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగనున్నాయి.
Bonalu Festival | పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి తొలి బోనం సమర్పించడంతో పండుగ ప్రారంభం అవుతుంది. జూలై 14న రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు ఫలహార బండ్ల ఊరేగింపు కూడా సందడిగా చేపడతారు. ఈ కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. దీంతో సికింద్రాబాద్ అంతా రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.
Bonalu Festival | నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రయాణికులు ప్యాట్నీ- ప్యారడైజ్- బేగంపేట వైపు రావొద్దని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.
టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుంచి మహంకాళి ఆలయం, బాటా ఎక్స్ రోడ్ నుంచి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్డు, ఔదయ్య ఎక్స్ రోడ్ నుంచి మహంకాళి ఆలయం, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆయం రోడ్లను జులై 13న రాత్రి 12 గంటల నుంచి 15 తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయం వద్ద ఏర్పాట్లను నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ జోయెల్ డేవిస్ శనివారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
Bonalu Festival | మద్యం దుకాణాల మూసివేత
బోనాల పండుగ నేపథ్యంలో నగరంలో మద్యం షాపులు (Wine Shops) మూసివేయనున్నారు. 13న ఉదయం ఆరు గంటల నుంచి 15న ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసి ఉంచాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.