అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD | టీటీడీలో (TTD) అన్యమత ఉద్యోగులు ఉన్నారన్నది వాస్తవమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రంలో అన్యమత ఉద్యోగులపై ఎంతోకాలంగా వివాదాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సైతం తిరుమలను దర్శించుకొని.. టీటీడీలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులు పని చేస్తున్నారన్నారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని ఒప్పుకోవడం గమనార్హం. అన్యమత ఉద్యోగులపై విచారణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ, టీటీడీ ఆధ్వర్యంలో శనివారం సంయుక్త సమావేశం నిర్వహించారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Nayudu), ఈవో శ్యామలరావు తదితరులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్‌లో ఉన్న సంయుక్త అంశాలపై అన్నమయ్య భవనంలో చర్చించారు.
TTD | వారికి రూ.3 వేల భృతి
దేవాదాయ చట్టం ప్రకారం తొమ్మిది శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాలనే నిబంధన ఉందని మంత్రి పేర్కొన్నారు. అర్చక నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉందన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 590 మంది వేద పండితులకు నెలకు రూ.మూడు వేల చొప్పున భృతి ఇస్తామన్నారు.
TTD | తిరుమల నుంచే ప్రక్షాళన
దేవాదాయశాఖ ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలని మంత్రి ఆనం అన్నారు. టీటీడీతో సమావేశానికి ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తితిదే ఉద్యోగులు, అర్చకుల సమస్యలు, భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాల మేరకు అన్ని అలయాల్లో భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు కల్పిస్తామన్నారు. కామన్ గుడ్ ఫండ్ నుంచి 200 ఆలయాల పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 300 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.