అక్షరటుడే, వెబ్‌డెస్క్: National Highway | నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Nirmal District Khanapur) నుంచి జగిత్యాల జిల్లా(Jagtial District) చల్‌గల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది. ఖానాపూర్ నుంచి బాదన్‌కుర్తి మీదుగా చల్‌గల్ వరకు 46 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 61ని విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
మహారాష్ట్ర(Maharashtra)లోని కల్యాణ్ నుంచి 61వ జాతీయ రహదారి ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ మీదుగా చల్‌గల్ వరకు ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనులు ఖానాపూర్ వరకు పూర్తయ్యాయి. త్వరలో ఖానాపూర్ నుంచి జగిత్యాల జిల్లా చల్‌గల్ విస్తరించనున్నారు.
National Highway | ఏడు ప్రాంతాల్లో అండర్ పాస్‌లు
నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు 35 కి.మీ. పొడవుతో ఇప్పటికే నేషనల్ హైవే(National Highway) పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్డులో ఏడు అండర్‌పాస్ చేపట్టాల్సి ఉండగా.. ఆరు నిర్మించారు. మరొకటి నిర్మాణంలో ఉంది. కాగా.. ఖానాపూర్ నుంచి చెల్‌గల్ వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి అలైన్‌మెంట్ పూర్తి కావడంతో త్వరలో డీపీఆర్ రూపొందించాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. డీపీఆర్‌కు ఆమోదం లభించగానే.. భూ సేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లాలో ఏడు కిలోమీటర్ల మేర, జగిత్యాలలో 39 కి.మీ. మేర భూములు సేకరించాల్సి ఉంటుంది.
National Highway | అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి
జాతీయ రహదారి పనుల్లో భాగంగా ఖానాపూర్ నుంచి మస్కాపూర్(Maskapur) వరకు బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. మొత్తం 7 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ మార్గంలో అటవీ భూములు ఉన్నాయి. దీంతో ఆ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఖానాపూర్ నుంచి చల్‌గల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రాథమిక సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.