అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | మహారాష్ట్ర(Maharashtra)లోని పురాతన సైనిక కోటలకు ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు లభించింది. మరాఠా సైనిక ల్యాండ్‌స్కేప్స్‌ను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం అని ‘X’లో పెట్టిన పోస్టులో అభివర్ణించారు.
మరాఠా సామ్రాజ్యం సుపరిపాలన, సైనిక బలం, అన్యాయాన్ని ఎదురించిన ప్రతిఘటనకు సాక్ష్యంగా నిలిచిన ఈ కట్టడాలకు గుర్తింపు లభించిందని అని పేర్కొన్నారు. “ఈ మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలలో 12 గంభీరమైన కోటలు ఉన్నాయి. మహారాష్ట్రలో 11, తమిళనాడులో ఒకటి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రదేశాలను సందర్శించి మరాఠా సామ్రాజ్యానికి చెందిన అద్భుతమైన గతం గురించి తెలుసుకోవాలని కోరారు.
PM Modi | స్వదేశీ సైనిక చాతుర్యానికి నిదర్శనం
మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ (Maratha Military Landscapes) సైనిక ఆవిష్కరణ, పర్యావరణ సామరస్యం, నిర్మాణ వైభవం ప్రత్యేకమైన భారతీయ వైభవానికి నిదర్శనంగా నిలిచాయి. 17 నుంచి 19వ శతాబ్దాల మధ్య ఈ కోటలను నిర్మించారు.
సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని కఠినమైన భూభాగాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా నిర్మించారు. మహారాష్ట్రలోని సల్హేర్, శివనేరి, లోహ్‌గడ్, ఖండేరి, రాయ్‌గడ్, రాజ్‌గడ్, ప్రతాప్‌గడ్, సువర్ణదుర్గం, పన్హాల, విజయదుర్గం, సింధుదుర్గంతో పాటు తమిళనాడులోని జింజీ కోటలను మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) హయాంలో శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దారు.
PM Modi | 44కు చేరిన వారసత్వ కట్టడాలు..
మరాఠా సైనిక కోటలకు వారసత్వ హోదా లభించడంతో.. భారత్‌లో ఈ హోదా కలిగిన కట్టడాల సంఖ్య 44కు చేరింది. ఇవి మన దేశ సాంస్కృతిక శక్తిని చాటుతున్నాయి. పారిస్‌లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ఈ మేరకు మరాఠా సైనిక కోటలకు (Maratha Military Forts) వారసత్వ హోదా ప్రకటించారు.
2024–25 సంవత్సరానికి వచ్చిన నామినేషన్లలో సాంకేతిక సంప్రదింపులు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ద్వారా ఆన్-సైట్ పరిశీలనను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై యునెస్కోలో భారత రాయబారి విశాల్ వి శర్మ (Indian Ambassador Vishal V Sharma) అధికారిక ప్రకటన చేస్తూ, భారతదేశానికి, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ ప్రజలకు ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. ఈ ఘనతను ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్ఞానానికి అంకితమిస్తున్నామని తెలిపారు.