అక్షరటుడే గాంధారి: CMRF check | సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు దారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. పలువురు లబ్ధిదారులకు ‘చెక్కులు మంజూరయ్యాయని.. వారం రోజుల్లో మీ ప్రజాప్రతినిధి వద్ద తీసుకోవాలని’ మెస్సేజ్‌లు వస్తున్నాయి. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా చెక్కులు రావడం లేదని దరఖాస్తు దారులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వైద్యం కోసం అప్పులు చేసి వైద్యం చేయించుకున్నామని.. కానీ పైసలు అందక అవస్థ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధారి మండల కేంద్రంలో చాలామంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందట్లేదని వాపోతున్నారు.
CMRF check | ఎస్సెమ్సెస్‌లు వచ్చి నెలరోజులవుతున్నా..
గాంధారి (Gandhari) మండల కేంద్రంలో సుమారు 300 నుంచి 400 మంది రోగులు తమ వైద్యానికి అయిన ఖర్చుల వివరాలతో ఎమ్మెల్యే ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొంతమందికి మెసేజ్‌ల రూపంలో ‘మీయొక్క చెక్కు ప్రజా ప్రతినిధి కార్యాలయానికి పంపబడింది.. ఏడు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్లండి’ అని మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వారు సంబురపడ్డారు. తమకు అయిన ఖర్చులో ఎంతోకొంత వస్తుందనే ఆశతో ఉన్నారు.
CMRF check | అయోమయంలో దరఖాస్తు దారులు
అయితే.. ఏడు రోజుల్లో వచ్చి తీసుకెళ్లాలని మెసేజ్‌లు వచ్చినప్పటికీ.. నెలలు గడుస్తున్నా సీఎంఆర్ఎఫ్ రాకపోవడంతో బాధితులు ఆందోళనలో ఉన్నారు. దరఖాస్తుకు అన్ని సర్టిఫికెట్లు సరైన పద్ధతిలో జత చేసినప్పటికీ చెక్కు రిలీజ్ కావడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. అసలు ఫండ్ వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు.
CMRF check | ఎంతో కొంత వచ్చినా బాగుండు..
చెక్కులు ఆలస్యమవుతున్నా కొద్దీ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. మొత్తానికి రిజెక్ట్ చేయకుండా ఎంతోకొంత వచ్చినా బాగుండు అంటూ నిట్టూరుస్తున్నారు. అసలే మధ్యతరగతి ప్రజలమని.. ప్రభుత్వ సాయంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నామని వారు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు చొరవ చూపి తమకు చెక్కులు అందేలా చూడాలని వారు కోరుతున్నారు. కాగా.. పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి సంప్రదించగా.. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారంరోజుల్లో చెక్ తీసుకోవాలని మెసేజ్‌లైతే వస్తున్నాయని.. కానీ నాలుగు నెలలు సమయం పడుతోందని వారికి చెబుతున్నట్లు సమాచారం.

చెక్కుకోసం ఎదురు చూస్తున్నాం..
– గుర్రం సంజీవ్, గురజాల, గాంధారి
సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసుకున్నా. జనవరిలో మాకు మెసేజ్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చెక్కు రాలేదు. మా తండ్రికి చికిత్స చేయించిన అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. స్థానిక ఏఎంసీ ఛైర్మన్ పరమేష్‌ను కలిశాను. త్వరలోనే అందుతుందని చెప్పారు.