అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్ ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ స్వామి వారి మీద, హిందూ విశ్వాసాల మీద నమ్మకం లేని దాదాపు వెయ్యి మందికిపైగా అన్యమతస్తులు టీటీడీలో పని చేస్తున్నారని ఆరోపించారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ అన్యమత ఉద్యోగులకు ఎక్కడో ఓ దగ్గర పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల టీటీడీ ఏఈవో రాజశేఖర్(TTD AEO Rajasekhar)ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన ఈవో సస్పెండ్ చేశారు.
Bandi Sanjay | ఆలయాలకు నిధులు కేటాయించాలి
టీటీడీ ఆధ్వర్యంలో పురాతన ఆలయాలను గుర్తించి నిధులు కేటాయించాలని బండి సంజయ్ సూచించారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందు రామాలయానికి నిధులు కేటాయించి టీటీడీ సహకరించాలని ఆయన కోరారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు టీటీడీని వాడుకోవద్దన్నారు. హిందువుల ఆస్తి, హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఇతర మతస్తులు ఉండడంతో ఆచార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.