అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vande Bharat Train | ప్రయాణికులకు రైల్వే శాఖ(Railway Department) గుడ్‌న్యూస్ చెప్పింది. ముంబై నుంచి జాల్నా మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నాందేడ్ వరకు పొడిగించింది.
ఆధునిక హంగులతో వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్లను కూడా ఇతర స్టేషన్లకు పొడిగిస్తోంది. ఇందులో భాగంగా ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి జాల్నా మధ్య నడుస్తున్న రైలును నాందేడ్(Nanded) వరకు పొడిగించింది.
Vande Bharat Train | పది స్టేషన్లు.. 9:25 గంటల ప్రయాణం
ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినల్ (Chhatrapati Shivaji Maharaj Terminal)– జాల్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినల్–హుజుర్ సాహేబ్ నాందేడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. గతంలో ఈ ట్రెయిన్ ముంబై నుంచి జల్నాకు 6 గంటల 50 నిమిషాల్లో వెళ్లేది. ప్రస్తుతం ముంబై నుంచి నాందేడ్‌కు 9 గంటల 25 నిమిషాల్లో చేరుకోనుంది. మధ్యలో దాదర్, థానే, కల్యాణ్, నాసిక్ రోడ్డు, మన్మాడ్, ఔరంగబాద్, జల్నా, పర్బనీ స్టేషన్లలో ఆగనుంది.
నాందేడ్ నుంచి ముంబై మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ వందే భారత్ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల నుంచి వీటికి ఆదరణ వస్తుండటంతో తాజాగా జాల్నా వరకు నడుస్తున్న వందే భారత్ రైలును నాందేడ్ వరకు పొడిగించింది.
Vande Bharat Train | నిజామాబాద్ వరకు పొడిగిస్తే మేలు
ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), కరీంనగర్ (Karim Nagar) జిల్లాల నుంచి నిత్యం ముంb వందలాది మంది రాకపోలకు సాగిస్తారు. సికింద్రాబాద్ నుంచి నాందేడ్, ముంబై మధ్య నడిచే రైళ్లలో నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. వీరు కూడా ముంబై మీదుగా రాకపోకలు సాగిస్తారు. అలాగే ముంబైలో ఎంతో మంది స్థిరపడ్డారు. ఈ క్రమంలో వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రస్తుతం ముంబైకి రైళ్లు అందుబాటులో ఉన్నా.. ప్రైవేట్ బస్సుల్లో చాలా మంది వెళ్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ బస్సులు నిజామాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వందేభారత్‌ను నిజామాబాద్ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు మేలు కలుగనుంది.