అక్షరటుడే, హైదరాబాద్: Bharat Bandh : కార్మికుల విషయంలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నేడు(జూలై 9న) దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు Trade unions బంద్ పాటిస్తున్నాయి. ఇందులో రైతులతో సహా 25 కోట్ల మంది కార్మికులు భాగస్వామ్యమవుతున్నారు.
భారత్ బంద్ ప్రభావం పరిశ్రమలు(industries), ఇన్సూరెన్స్(insurance), పోస్టల్(postal), బ్యాంకింగ్(banking), బొగ్గు గనులు(coal mines), పోస్టల్(postal), కర్మాగారాలు(factories), ప్రజా రవాణా(public transport), ప్రభుత్వ రంగ సంస్థల (public sectors) పై పడుతుంది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచారు. ఇది జరిగి ఏడాది గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సార్వత్రిక సమ్మెకు దిగాయి.
గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం (central government) కార్మిక వార్షిక సదస్సులు నిర్వహించడం లేదనేది ప్రధాన ఆరోపణ. దీనికితోడు కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి కార్మికుల ప్రయోజనాలు బలహీనపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. యూనియన్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా వీటిని రూపొందించారనేది సంఘాల వాదన.
Bharat Bandh : నిరుద్యోగిత పెరుగుతోందని…
కేంద్ర సర్కారు ఆర్థిక విధానాల వల్లనే దేశంలో నిరుద్యోగిత(unemployment) పెరుగుతోందనేది కార్మిక సంఘాల ఆరోపణ. నిత్యావసర సరకుల ధరలు కూడా పెరుగుతున్నాయని, కానీ ఉద్యోగుల వేతనాలు మాత్రం తగ్గుతున్నాయని వాదిస్తున్నాయి. దీనికితోడు ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే రంగ వ్యయంలో కోత పెడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
దీనివల్ల తక్కువ ఆదాయ వర్గాల వారు, పేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలకు దారితీస్తున్నాయని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దేశ సంక్షేమాన్ని కేంద్రం పక్కన పెట్టిందని.. దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని నిరసన తెలుపుతున్నాయి.
Bharat Bandh : గతంలోనూ…
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టరైజేషన్, అవుట్‌సోర్సింగ్ విధానాలు, శ్రామిక శక్తిని క్యాజువలైజేషన్ చేయడం వంటి వాటిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో నవంబరు 26, 2020న, మార్చి 28-29, 2022 రోజుల్లో, ఫిబ్రవరి 16, 2024న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి.
Bharat Bandh : ప్రస్తుతం ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
సహకార బ్యాంకులు పనిచేయకపోవచ్చు. ప్రైవేటు బ్యాంకులు కొనసాగే అవకాశం ఉంది. ఇక విద్యాసంస్థలు(Educational institutions), ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా నడుస్తున్నాయి. రవాణా విషయంలో కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. ఇక, సుమారు 27 లక్షల మంది విద్యుత్తు రంగ అధికారులు ఈ బంద్‌లో భాగస్వామ్యం అవుతున్నారు. రైళ్ల విషయం తీసుకుంటే.. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవొచ్చని చెబుతున్నారు.