అక్షరటుడే, వెబ్డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజున గురువులను సత్కరించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల 10వ తేదీన గురు పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకోనున్నారు.
ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్థం. వేద(Veda) జ్ఞానాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి సామాన్యుడి చెంతకు చేరేలా చేసింది వ్యాస మహర్షి. అందుకే ఆయనను వేద వ్యాసుడు(Veda vyasudu) అంటారు. వేద జ్ఞానాన్ని వ్యవస్థీకృతం చేసి మానవాళికి అందించినందున ఆయన గురువయ్యారు. ఆయన జన్మతిథి(Janma tithi) గురు పౌర్ణమిగా మారింది.
Guru Purnima | జ్ఞానాన్ని వ్యవస్థీకృతం చేసి..
యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి(Adiyogi). గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం).. నాదం నుంచి వేదం పుట్టాయి. ఈ వేదాన్ని శ్రీమహావిష్ణువు(Sri Maha Vishnu) బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మ తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షి(Maharshi Parashara)కి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి వేద జ్ఞానాన్ని అందించారు.
భారతీయ ఆర్ష వాంగ్మయంలో వ్యాసుడికి ప్రత్యేక స్థానం ఉంది. మేధాశక్తి, ధర్మదీక్ష, ఆధ్యాత్మిక పరిణతి, జ్ఞాన పటిమలతో వ్యాసమహర్షి(Maharishi Vyasa) సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు. తండ్రి ద్వారా నేర్చుకున్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి జాతికి అమూల్యమైన కానుక ఇచ్చి ఆయన వేద వ్యాసుడయ్యారు. పంచమ వేదంగా చెప్పుకునే మహా భారతాన్ని(Maha Bharatham) మనకు అందించిందీ ఆయనే.. భాగవత మకరందాన్ని అందించిందీ, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు రాసిందీ ఈ వ్యాస భగవానుడే.. ఆ మహర్షి జన్మించింది, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి అందించింది ఆషాఢ పౌర్ణమి(Ashadha purnima) రోజునే అని చెబుతారు. అందుకే ఆ తిథిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. హిందూ సంప్రదాయాలు పాటించే భారత్, నేపాల్(Nepal) వంటి దేశాలతోపాటు బౌద్ధ, జైన సంప్రదాయాలు పాటించే చోట్ల సైతం గురు పౌర్ణిమను ఘనంగా జరుపుకుంటారు.