అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Karnataka | కర్ణాటకలో నాయకత్వ అంశం దుమారం రేపుతూనే ఉంది. ఐదేళ్లూ ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar)ను సీఎం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో కచ్చితంగా నాయకత్వాన్ని మార్చాలని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLA’s) తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పుడున్న వారిని మార్చి కొత్త వారికి అవకాశమివ్వాలని కోరారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించిన కొన్ని రోజులకే ఎమ్మెల్యేలు మరోమారు గొంతెత్తారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను అత్యున్నత పదవికి నియమించాలని డిమాండ్ చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం రేపింది.
Karnataka | కొత్త నాయకత్వం కావాలి..
కాంగ్రెస్ పార్టీ మార్పునకు సిద్ధంగా ఉండాలని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్వీర్ సైత్(Former Minister Tanveer Sait) అభిప్రాయపడ్డారు. కొత్త నాయకత్వం రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. “నాయకత్వం ఎప్పుడూ స్తబ్దుగా ఉండకూడదు. కొత్త నాయకత్వం రావాలి. అవకాశం ఇచ్చినప్పుడే అది జరుగుతుంది” అని సైత్ అన్నారు. అదే సమయంలో వ్యక్తిగత ప్రకటనలు చేయడాన్ని నిరసనగా పరిగణించకూడదని పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్(Congress MLA CP Yogeshwar) కూడా శివకుమార్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. డీకే ముఖ్యమంత్రి కావాలని మా జిల్లా ఎమ్మెల్యేలందరూ కోరుకుంటున్నారని, ఇందులో ఎటువంటి విభేదాలు లేవన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Karnataka | కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం..
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన డీకేకు సీఎం అవకాశం ఇస్తారని భావించగా, హైకమాండ్ సిద్దరామయ్యను(Siddaramaiah) ముఖ్యమంత్రిని చేసింది. అయితే, డీకే, సిద్దు చెరో రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగాలని అప్పట్లో నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఆ గడువు ముగిసిపోయినప్పటికీ సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్(Congress MLA Iqbal Hussain) చేసిన ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించాలని పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది పట్టుబడుతున్నారు. కానీ, హైకమాండ్ అందుకు అంగీకరించడం లేదు. కర్ణాటకలో ఎటువంటి మార్పు ఉండదని, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా(Randeep Singh Surjewala) ఇటీవల స్పష్టంగా చెప్పారు. దీనిపై రెండో ఆలోచన లేదన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే పార్టీ ఎమ్మెల్యేలు ఉద్దరు డీకేను ముఖ్యమంత్రిని చేయాలనడం పార్టీలోని ఆధిపత్య పోరును ప్రస్ఫుటం చేసింది.