అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కేటీఆర్ మంగళవారం ఉదయం చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)కు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే అసెంబ్లీ చర్చకు రావాలని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని విరుచుపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి నివాళి అర్పించారు. కాంగ్రెస్ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
KTR | బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి బేసిక్ నాలెడ్జ్ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయినా చర్చకు రావాలని మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో తమకు సవాల్ విసరడంతో వచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. 72 గంటల సమయం ఇచ్చి.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారన్నారు. ఆయన స్థానంలో మంత్రులను కూడా పంపలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఈ రోజు తేలిపోయిందన్నారు.
KTR | తెలంగాణ రైతులకు సున్నం
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు(Telangana Farmers) సున్నం పెడుతూ.. కృష్ణ, గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు(Chandrababu Covert) పాలన నడుస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులను ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఆయన తొత్తులు కొత్త మందికి నియామకాలు ఇచ్చి రేవంత్‌రెడ్డి మురిసి పోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బస్తాలు మోసి సీఎం పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
KTR | ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ
ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే సంక్షేమ పాలన అని ప్రజలు అనుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్బంధాలు, అణచివేతలు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపించేలా తెలంగాణలో పాలన సాగుతోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారన్నారు.