అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైళ్లను (Vande Bharat trains) అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సౌకర్యాలను ఈ రైళ్లలో సమకూర్చింది. రద్దీ అధికంగా ఉండే పెద్ద నగరాల మధ్య ప్రస్తుతం వీటిని నడుపుతోంది. అయితే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. దీంతో రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ రైళ్లలో బోగీలు పెంచాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు (Hyderabad to Bangalore) నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తారు. దీంతో హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్పూరకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైలును నడుపుతోంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 2023 సెప్టెంబర్ 28న వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రైన్ ఎనిమిది బోగీలతో 530 మంది సిటింగ్ సామర్థ్యంతో సర్వీసులందిస్తోంది. అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో వందేభారత్‌లో సీట్లకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ బోగీల సంఖ్యను డబుల్ చేయాలని నిర్ణయించింది. జులై 10 నుంచి ఈ మార్గంలో వందే భారత్ 16 కోచ్‌లతో నడవనుంది.
Vande Bharat | డిమాండ్ ఎక్కువగా ఉండడంతో..
కాచిగూడ–యశ్వంత్‌పుర–కాచిగూడ మార్గంలో వందే భారత్‌కు డిమాండ్ అధికంగా ఉంది. అంతేగాకుండా వందశాతం ఆక్యూపెన్సీ నమోదవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. ప్రస్తుతం 530 మంది వెళ్లే అవకాశం ఉండగా బోగీల పెంపుతో ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం 1,128 కు పెరగనుంది. కాగా జులై 10 నుంచి 14 చైర్ కార్లు కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో ఈ మార్గంలో వందే భారత్ రైలు నడవనుంది.
కోచ్‌లు డబుల్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. బుధవారం మినహా మిగతా రోజుల్లో సేవలు అందిస్తోంది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పురకు (Kacheguda to Yeshwantpur) 612 కిలోమీటర్ల దూరం ఉండగా.. 8 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. మధ్యలో నాలుగు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలలో వందేభారత్‌కు స్టాప్ ఉంది.