అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని నిరసిస్తూ విద్యార్థినులు(Students) ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు సోమవారం ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు.
Yellareddy | తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాం..
విధిలేని పరిస్థితుల్లో తాము రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల నిరసనతో ఎల్లారెడ్డి – బాన్సువాడ(Yellareddy Banswada) ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్(Yellareddy Tahsildar Prem Kumar) రోడ్డుపై భైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
Yellareddy | పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్..
అనంతరం గిరిజన బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్(Additional Collector Victor) పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న ఆయన పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, స్టాక్ రూమ్, వాష్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న ఆయన త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈవో రాజులు తదితరులు పాల్గొన్నారు.

Read all the Latest News on Aksharatoday.in