అక్షరటుడే, వెబ్‌డెస్క్: Texas Floods : యూఎస్‌లోని టెక్సస్ వరదలతో అల్లాడుతోంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. కెర్ విల్లే, శాన్ ఏంజెలో, శాన్ ఆంటోనియో ప్రాంతాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటి వరకు అందిన గణాంకాల ప్రకారం.. వరదల వల్ల 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
Texas Floods : 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తు ప్రవాహం..
గ్వాడాలూపే నది ఉగ్రరూపం దాల్చింది. కేవలం 45 నిమిషాల్లో నీటిమట్టం 8 మీటర్ల ఎత్తుకు చేరి, భయానకంగా మారింది. ఈ నదికి వచ్చిన భారీ వరద నీటిలో చిక్కుకుని 21 మంది చిన్నారులు సహా 51 మంది మరణించారు. కౌంటీల్లో మరో 16 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
Texas Floods : వేగంగా సహాయక చర్యలు…
వరదల్లో ఇల్లు, చెట్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. నది ఉగ్రరూపానికి దాని చుట్టుపక్కల ప్రాంతమంతా తుడిచిపెట్టుకుపోయింది. 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లతో తొమ్మిది రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వరదల్లో చిక్కుకున్న 237 మంది ప్రజలను సహాయక బృందాలు రక్షించి ఒడ్డుకు చేర్చాయి.

ఆదివారం మధ్యాహ్నం తమ ప్రార్థనల తర్వాత పోప్ లియో 14 ఇంగ్లిష్ ప్రసంగించారు. వరదల్లో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదల్లో చిక్కుకున్నవారి క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Texas Floods : అధికారుల నిర్లక్ష్యం..
వరద తీవ్రతను తాము ఊహించలేదని అధికారులు తెలిపారు. వరదలు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని నేషనల్ వెదర్ సర్వీస్ సకాలంలో అప్రమత్తం చేయలేదని ప్రజలు మండిపడ్డారు.
Texas Floods : వీడియో వైరల్
టెక్సస్ వరదల వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరద మొదలై.. వెంటవెంటనే నీటి మట్టం పెరుగుతూ ఉగ్రరూపం దాల్చడాన్ని వీడియోల్లో చూడొచ్చు. చెట్లు విరిగిపడటం, ఇల్లు కొట్టుకురావడం వీడియోలో రికార్డు అయింది.
Texas Floods : బాలికల గల్లంతు..
కెర్ కౌంటీలోని గ్వాడెలూప్ నదికి ఆకస్మికంగా వరద వచ్చింది. దీంతో ఈ నదీ ప్రవాహం మిస్టిక్ క్యాంపు వేసవి శిక్షణ శిబిరాన్ని ముంచేసి తనతోపాటు తీసుకెళ్లింది. ఫలితంగా ఇక్కడి 27 మంది బాలికలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. 36 గంటలు గడిచినా బాలికల ఆచూకీ ఇంకా లభించలేదు.