అక్షరటుడే, వెబ్‌డెస్క్: Falcon Scam | అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెట్టి డిపాజిట్‌దారులను మోసం చేసిన ఫాల్కన్ కంపెనీ (Falcon Scam) కేసులో సీఐడీ (CID) దూకుడు పెంచింది. ఈ కేసులో తాజాగా ఫాల్కన్ గ్రూప్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా దందా నడిపిన ఈ కంపెనీ 7,056 మంది డిపాజిట్దారుల నుంచి రూ. 4,215 కోట్లు వసూలు చేసింది. మొత్తం రూ.792 కోట్లు టోకరా వేసి బోర్డు తిప్పేసింది.
Falcon Scam | ఏమిటీ ఫాల్కన్ స్కామ్
ఫాల్కన్ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరిట ప్రజలను మోసం చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కంపెనీని ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ప్రజలకు ఆశ చూపారు. 145 రోజుల స్కీమ్‌లో చేరితే 11–12శాతం, 90 రోజుల స్కీమ్‌లో 16- 18 శాతం, 180 రోజులు అంతకంటే ఎక్కువ రోజులున్న ఇన్వాయిస్ ప్లాన్‌లో చేరితే 20– 21.95 శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేశారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరి ప్రకటనలను నమ్మి ఎంతో మంది ఇందులో తమ డబ్బులను ఇన్వెస్ట్ చేశారు. మొదట కొందరికి డబ్బులు తిరిగి చెల్లించిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Falcon Scam | రూ.14 కోట్ల విలువైన ఛార్టెడ్ ఫ్లైట్ సీజ్
ఫాల్కన్ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగింది. నిధులను దుబాయి(Dubai)కి తరలించారు. దీంతో ఈడీ (ED) సైతం ఈ కేసులో విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఫాల్కన్ గ్రూప్ ఛైర్మన్ అమర్‌దీప్‌కుమార్‌కు చెందిన రూ.14 కోట్ల విలువైన చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను మార్చిలో ఈడీ సీజ్ చేసింది. డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బును ఈ కంపెనీ 22 డోల్ల కంపెనీల ద్వారా యూఏఈకి తరలించింది. ఈ సంస్థ 2022లో బోర్డు తిప్పేయగా.. ఛైర్మన్ అమర్‌దీప్ కుమార్, వివేక్ సేత్ సహా సీఈవో యోగేందర్, సీవోవో ఆర్యన్ సింగ్ దుబాయ్‌కి పారిపోయారు. తాజాగా ఇందులో ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read all the Latest News on Aksharatoday.in