అక్షరటుడే, వెబ్డెస్క్ : China President | చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (China President Jinping) అదృశ్యమయ్యారు. కొంత కాలంగా ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించక పోవడం ప్రపంచవ్యాప్తంగా అనేక ఊహాగానాలకు తెర లేపింది.
ఆయన ఆరోగ్యంపై సందేహాలు రేకెత్తుతుండగా, మరోవైపు చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత తిరుగుబాటుతో ఆయన కనిపించకుండా పోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిన్ పింగ్ చివరిసారిగా మే మూడో వారంలో కనిపించారు. అయితే, దాదాపు 15 రోజులుగా ఆయన ఆచూకీ లేకుండా పోయింది. అదే సమయంలో బ్రిక్స్ సమావేశంలో ఆయన పాల్గొనడం లేదని చైనా ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, జిన్ పింగ్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారా? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (China Communist Party)లో తిరుగుబాటు తలెత్తడంతో అధికారం కోల్పోయారా? అన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
China President | ప్రభుత్వ మీడియా మౌనం..
చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా సాధారణంగా పూర్తిగా అధ్యక్షుడు జిన్ పింగ్ కవరేజీ వార్తలతోనే నిండి పోయేది. ఆయన అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు అన్నింటినీ హైలెట్ చేసేది. అయితే, కొంతకాలంగా ప్రభుత్వ మీడియాలో జిన్ పింగ్ వార్తల ఊసే లేదు. అధ్యక్షుడి కవరేజీ విషయంలో మౌనం పాటిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, చైనాలో పర్యటించే విదేశీ ప్రముఖులతో అధ్యక్షుడు కాకుండా దిగువ స్థాయి కమ్యూనిస్టు పార్టీ నేతలు, అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది జిన్ పింగ్ అదృశ్యంపై వస్తున్న పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. అదే సమయంలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి (BRICS summit) ఆయన హాజరు కారని ఇప్పటికే చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రతి శిఖరాగ్ర సమావేశానికి హాజరైన జిన్ పింగ్.. ఈసారి మాత్రమే హాజరు కాకుండా పోవడంపై ఆయన పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
China President | అంతర్గత తిరుగుబాటు?
అధికారాన్ని గుప్పిట పట్టిన జిన్ పింగ్ చైనాలో అత్యంత బలమైన వ్యక్తిగా ఎదిగారు. అదే సమయంలో తనకు ఎదురు తిరిగిన వారిని అణచి వేశారు. వాస్తవానికి ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీదే హవా. ఏ కీలక నిర్ణయమైనా పార్టీ ఆదేశాల ప్రకారమే జరుగుతుంటుంది. అయితే పార్టీని కాదని జిన్ పింగ్ పూర్తిగా అధికారాన్ని గుప్పిట పట్టారు. పార్టీ స్థానంలో ఏక వ్యక్తి పాలనకు పెద్ద పీట వేశారు.
అదే సమయంలో పార్టీ నియమాలను తిరగ రాయడం, సైనిక అధికారులను ప్రక్షాళన చేయడం, అసమ్మతిని అణగదొక్కడం ద్వారా పాలనపై పూర్తిగా పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ వైఖరి నచ్చక కమ్యూనిస్టు పార్టీలో అసమ్మతి చెలరేగింది. అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (Peoples Liberation Army)లో అంతర్గత ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీంతో జిన్ పింగ్ అధికారాలకు కమ్యూనిస్టు పార్టీ కత్తెర వేయడం ప్రారంభించినట్లు తెలిసింది. జూన్ మొదటి వారంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో జరిగిన సమావేశంలో ఆయన బాడీ లాంగ్వేజ్ లో అసాధారణ మార్పును పరిశీలకులు గమనించారు. అలాగే, అతనికి భద్రత తగ్గించినట్లు గుర్తించారు. అదే సమయంలో జిన్ పింగ్ తండ్రి సమాధికి అధికారిక హోదా నిశ్శబ్దంగా రద్దు చేయబడింది. ఆయా పరిణామాలు జిన్ పింగ్ ను తప్పించేందుకు చేసిన ప్రయత్నాలేనని భావిస్తున్నారు.
China President | జాంగ్ కు బాధ్యతలు?
జిన్ పింగ్ అదృశ్యం కావడానికి కారణాలు ఇప్పటివరకైతే బయటకు రాలేదు. అయితే, ఆయనను బలవంతంగా పదవి నుంచి తొలగించారా.. లేదా ఆయనే తప్పుకున్నారా? అన్న దానిపై సమాచారం లేదు. కానీ, ఆయన వారసుడిగా ఎవరు ఉంటారనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (Peoples Liberation Army) చెందిన జనరల్ జాంగ్ యూక్సియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. జిన్ పింగ్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ అధ్యక్షుడు హూ జింటావో (former President Hu Jintao) మద్దతు ఆయనకు బలంగా ఉందని భావిస్తున్నారు. సైన్యంతో జాంగ్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు, సీసీపీలో పెరుగుతున్న ప్రభావం అధికార మార్పు సందర్భంలో ఆయనను వారసుడిగా మారుస్తాయని చెబుతున్నారు.