అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tholi Ekadashi | ఏటా తొలి ఏకాదశి(Tholi ekadashi) పండుగను ఆషాఢ మాస(Ashadha Masam) శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజునుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వస్తాయి. అందుకే తొలి ఏకాదశిని సంవత్సరంలో వచ్చే మొదటి పండుగగా భావిస్తారు.
ఈ ఏకాదశిని పద్మ, హరిశయని, దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీమహా విష్ణువు(Sri Maha Vishnu) క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనకు శ్రేష్టమైన కాలం. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఈ కాలంలో చాతుర్మాస్య వ్రతం చేస్తారు. కాగా స్వామివారు యోగ నిద్రలో ఉండే ఈ కాలంలో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేయరు. ఈ ఆదివారం తొలి ఏకాదశి. ఈ సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టతలపై కథనం..
Tholi Ekadashi | దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం
మకర సంక్రాంతి నుంచి ఆరు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం(Uttarayanam) పూర్తై తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం(Dakshinayana Punyakalam) ప్రారంభం అవుతుంది. ఈ కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు.. ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని పెద్దలు సూచిస్తారు. అందుకే ఈ కాలంలో వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నిర్దేశించారు.
Tholi Ekadashi | ఈ రోజు ఏం చేయాలంటే..
తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజించాలి. మద్యం, మాంసాహరాలకు దూరంగా ఉండాలి. రోజంతా శ్రీమహావిష్ణువును ధ్యానించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాలను పఠించాలి. వీలైతే ఉపవాసం(Fasting) ఉండాలి. ఏకాదశిన ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఒకవేళ పూర్తి ఉపవాసం ఉండడం సాధ్యం కానివారు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
తొలి ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి తిథిలో విరమిస్తారు. పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం సోమవారం ఉదయం 5.29 నుంచి ఉదయం 8.16 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలోనే ఉపవాసం విరమించాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియనే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని భక్తులు నమ్ముతారు.
Tholi Ekadashi | పితృదేవతల ప్రీతి కోసం..
తొలి ఏకాదశిన పేలాల పిండి తినాలని సూచిస్తారు. దీనికి కారణం లేకపోలేదు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని భావిస్తారు. తొలి ఏకాదశిన పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు వారిని గుర్తు చేసుకుంటూ పేలాల పిండి తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
Toli Ekadashi | పేలాల పిండి తయారీ విధానం..
పేలాలను వేయించి బెల్లం, నెయ్యి, యాలకులు, శొంఠిపొడులు కలిపి రోట్లో వేసి దంచాలి. దీనినే పేలాల పిండి అంటారు. ఈ పేలాల పిండికి ఆరోగ్యపరంగానూ ప్రాధాన్యత ఉంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో వాతావరణంలో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. పేలాల పిండి ఒంట్లో వేడిని కలగజేసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుందని భావిస్తారు.