అక్షరటుడే, వెబ్డెస్క్: New Schools | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కొత్తగా ప్రైమరీ పాఠశాలల (New primary schools) ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రంలో విద్యార్థులు లేరని చాలా బడులను మూసివేశారు. అయితే ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం 20 విద్యార్థులు ఉంటే కొత్త పాఠశాలను ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
New Schools | కొత్తగా 571 పాఠశాలల ఏర్పాటు
కనీసం 20 మంది విద్యార్థులు ఉన్న చోట ప్రస్తుతం పాఠశాల లేకపోతే వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం (Government) ఆదేశించింది. మారుమూల పల్లెలు, తండాల్లో ప్రస్తుతం విద్యార్థులున్నా.. బడులు లేవు. దీంతో వారు సమీప గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఎంతో మేలు జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 212, పట్టణ కాలనీలు, వార్డుల్లో 359 ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ (Education Department) నిర్ణయించింది.
New Schools | ఉపాధ్యాయుల సర్దుబాటు
ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బడుల్లోకి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ విద్య బలోపేతంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కొత్త బడుల ఏర్పాటుపై గత నెలలోనే ఆదేశాలిచ్చారు. అయితే విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
New Schools | ఇప్పటికే ప్రీ ప్రైమరీ విద్య
పేదలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని 200కు పైగా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను (Pre Primary Education) ప్రవేశపెట్టింది. ఆయా బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 571 కొత్త ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో స్థానికంగా బడులు లేక దూర ప్రాంతాలకు వెళ్తున్న విద్యార్థులకు మేలు జరగనుంది.