అక్షరటుడే, వెబ్డెస్క్: Pet Rules | పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గట్టి షాక్ ఇచ్చింది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(Surat Municipal Corporation). ఇకపై ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే, కేవలం మీకు ఇష్టముండడం సరిపోదు. పొరుగింటి వారి అనుమతి కూడా అవసరం. కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. కుక్క పెంపకం కోసం కనీసం 10 మంది పొరుగువారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (No Objection Certificate) తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిబంధన స్వతంత్ర ఇళ్లకే పరిమితం కాదు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి కూడా. ఆయా భవన సంక్షేమ సంఘం ఛైర్మన్ మరియు కార్యదర్శి నుంచి కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ రెండు ధ్రువపత్రాలను సమర్పించిన తర్వాతనే ఇంట్లో కుక్కను పెంచుకునే హక్కు లభిస్తుంది.
Pet Rules | పొరుగువారి అనుమతి తప్పనిసరి..
ఈ కఠినమైన నిర్ణయం వెనుక కారణాన్ని అధికారులు స్పష్టంగా తెలిపారు. మే నెలలో సూరత్(Surat)లో జరిగిన ఒక విషాదకర సంఘటనలో ఓ చిన్నారి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ముందస్తు చర్యగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు మున్సిపల్ అధికారులు (Municipal Officers) వెల్లడించారు. ఇప్పటికే ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. పెంపుడు జంతు యజమానుల్లో కొందరు దీనిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది వారి వ్యక్తిగత హక్కులను హరించడమేనంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి రూల్ మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా చాలా మంది కుక్కకాటు బారిన పడ్డారు. వీధుల్లో తిరిగే కుక్కలే కాకుండా పెంపుడు కుక్కలు కూడా గాయపరుస్తున్నాయి. కుక్కల వలన చాలా గొడవలు అయ్యాయి. కోర్టులకు పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.