అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fasting | ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని అర్థం. ఉపవాసం (Upavasam/fasting) అనగా భగవంతుడికి దగ్గరగా నివసించడం అని అర్థం. వయసుతో సంబంధం లేకుండా హిందువులు ఎప్పుడో ఒకప్పుడు ఉపవాసం ఉంటారు. రోజుకో దేవుడి పేరుతో, శివరాత్రి (Shivarathri) పర్వదినం సందర్భంగా, ఏకాదశి (Ekadashi) తిథులలో చాలామంది ఎలాంటి ఆహారం తీసుకోకుండా గడుపుతారు. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక వికాసానికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. ఇలా అప్పుడప్పుడు కడుపును ఖాళీగా ఉంచడం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి.
ఎంత శుచికరమైన, రుచికరమైన ఆహారమైనా అతిగా తింటే అనర్థాలు తప్పవు. మితాహారం ఎంతో మంచిది. అప్పుడప్పుడు కడుపును ఖాళీగా ఉంచడం ఇంకా మంచిది. ఉపవాసం అంటే నిర్దిష్ట కాలం ఆహారానికి, పానీయాలకు దూరంగా ఉండడం. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుందని పలు పరిశోధనలలోనూ వెల్లడయ్యింది. ఉపవాసం జీవక్రియ రేటును నెమ్మదించేలా చేస్తుంది. సరైన పద్ధతిలో ఉపవాసం చేస్తే పలు ప్రయోజనాలు (Benifits) ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..
కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వడమే ఉపవాసం. ఇలా చేయడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితమవుతుంది. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.
ఖాళీ కడుపుతో ఉండడం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత (Concentration), సంకల్పశక్తి పెరుగుతాయి. ఉపవాసంలో మన శరీరం శక్తి కోసం నిల్వ చేసిన గ్లూకోజ్ (Glucose)ను ఉపయోగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారికి మరింత ప్రయోజనకరం.
ఉపవాసం శరీరంలో యాంటీఆక్సిడెంట్ (Antioxidant) స్థాయిలను పెంచుతుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వ్యాధిని నిరోధించే కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తి(Imunity power)ని పెంచుతుంది.
బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శరీరంలోని కొవ్వు(Cholesterol)ను తగ్గించడంలో సహకరిస్తుంది. తద్వారా బరువూ తగ్గవచ్చు(Weight loss).
వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం పడుతుంది. మెదడు కణాలను రక్షించే, మరమ్మతు చేసే కొన్ని ప్రొటీన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది క్రమంగా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఉపవాసంలో బలహీనంగా అనిపిస్తే తేనె కలిపిన నీళ్లు, కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమం.
Fasting | ఉపవాస విరమణ ఇలా..
ఉపవాసం చేశాక ముందుగా పండ్లు(Fruits), నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ షర్బత్ తీసుకోవాలి. ప్రధాన భోజనంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది.