అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India-US trade deal | ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ పియూష్ గోయల్ (Union Commerce Minister Piyush Goyal) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఏదైనా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు లాభదాయకమైన పరిస్థితిలో మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) విధించిన జులై 9వ తేదీ గడువు గురించి ప్రశ్నించిప్పుడు ఆయన తేలిగ్గా కొట్టిపడేశారు. గడువులను దృష్టిలో ఉంచుకుని ఇండియా వాణిజ్య ఒప్పందాలు చేసుకోదని గోయల్ తెలిపారు. వచ్చే వారం లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని భారత్, అమెరికా చూస్తున్న తరుణంలో గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
India-US trade deal | జాతి ప్రయోజనాలకే పెద్దపీట..
భారత్ ఎప్పుడూ జాతి ప్రయోజనాల మేరకే వాణిజ్య ఒప్పందం చేసుకుంటుందని గోయల్ తెలిపారు. గడువును బట్టి ఒప్పందాలు జరుగవని, పరస్పర ప్రయోజనాల మేరకే ఇవి ఖరారవుతాయన్నారు. భారతదేశం ఎప్పుడూ గడువు లేదా కాలక్రమం ఆధారంగా వాణిజ్య ఒప్పందాన్ని (trade deal) చేసుకోదు. ఒప్పందం మంచిగా, పూర్తిగా పరిణతి చెందినప్పుడు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, మేము దానిని అంగీకరిస్తాం” అని ఆయన తేల్చి చెప్పారు. ఇండియా సొంత నిబంధనల మేరకు చర్చలు జరుపుతుందన్నారు. ఆ దిశలోనే వివిధ దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అది యూరోపియన్ యూనియన్ అయినా, న్యూజిలాండ్, ఒమన్, యునైటెడ్ స్టేట్స్, చిలీ లేదా పెరూ అయినా.. భారత ప్రయోజనాల కోణంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. “పరస్పర ప్రయోజనం ఉన్నప్పుడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతుంది. భారతదేశ ప్రయోజనాలను పరిరక్షిస్తూ, జాతీయ ప్రయోజనాలే ఎల్లప్పుడూ ప్రధానమని దృష్టిలో ఉంచుకుని ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది” అని గోయల్ స్పష్టం చేశారు.