అక్షరటుడే, వెబ్‌డెస్క్: LIC Savings Plan | ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కొత్త సేవింగ్ ప్లాన్ల(Saving plan)ను తీసుకొచ్చింది. నవ జీవన్ శ్రీ(Nav Jeevan Shree), నవ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్(Non linked), లైఫ్, ఇండివిడ్యువల్ సేవింగ్ ప్లాన్స్. పెట్టుబడికి భద్రత, వడ్డీతో పాటు బీమా కవరేజీ కోరుకునే వారికి ఇవి ఉత్తమమైన ఎంపికలుగా ఉంటాయని భావిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్లాన్లు వచ్చే ఏడాది మార్చి 31వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఎల్‌ఐసీ నవ జీవన్ శ్రీ- సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911) ప్లాన్ వివరాలు తెలుసుకుందామా..
ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకొనే వారి కోసం ఎల్‌ఐసీ ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ (Single premium plan)ను అందుబాటులోకి తెచ్చింది. 30 రోజుల వయసు నుంచి 60 ఏళ్ల వయసువారి వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస పాలసీ వ్యవధి 5 ఏళ్లు, గరిష్టంగా 20 ఏళ్లు. మెచ్యూరిటీకి కనిష్ట వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 75 ఏళ్లు.
కనీస హామీ మొత్తం లక్ష రూపాయలు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. ఆప్షన్–1లో డెత్ బెన్‌ఫిట్ (Death benefit) కింద సింగిల్ ప్రీమియానికి 1.25 రెట్లు లేదా కనీస హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్–2లో సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ ఉంటుంది. ఈ పాలనీలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 85 చొప్పున గ్యారంటీ అడిషన్ లభిస్తుంది. పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం ఆ మొత్తం అందుతుంది.
మెచ్యూరిటీ (Maturity) మొత్తం లేదా పాలసీ హోల్డర్‌కు రిస్క్ జరిగినా ఎల్‌ఐసీ నుంచి వచ్చే మొత్తాన్ని ఒకేసారి లేదా నెల, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక వార్షిక ప్రాతిపదికన తీసుకోవచ్చు. 18 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షలకు ఐదేళ్ల కాలానికి ఈ పాలసీ తీసుకుంటే ఆప్షన్–1 కింద ఒకేసారి ప్రీమియం(Premium) చెల్లిస్తే.. చెల్లించే ప్రీమియం మొత్తం రూ.5,39,325 అవుతుంది. దీనికి పాలసీదారుకు ఏడాదికి రూ.42,500 చొప్పున గ్యారంటీ అడిషన్ లభిస్తుంది. అలా ఐదేళ్ల కాలానికి రూ.2.12 లక్షలు వస్తాయి. ఐదో ఏడాది పాలసీ కనీస హామీ మొత్తం, గ్యారంటీడ్ అడిషన్(Guaranteed Addition) కలిపి మెచ్యూరిటీ కింద రూ.7,12,500 వస్తాయి. ఒకవేళ పాలసీ కాలంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షల వరకు క్లెయిమ్ లభిస్తుంది.