అక్షరటుడే, వెబ్‌డెస్క్:D Mart | అత్యంత తక్కువ ధరలకు నిత్యావసరాలు, ఇతర వస్తువులు విక్రయించే సంస్థల్లో ప్రధానంగా ముందుండేది డీమార్ట్(D Mart). డిస్కౌంట్లకు పేరెన్నికగన్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక స్టోర్లు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రాధాకిషన్ ధమానీ(Radhakishan Dhamani)కి చెందిన ఈ సంస్థ స్టోర్లు అన్ని ప్రధాన నగరాల్లో కలిపి 400లకు పైగా ఉన్నాయి. అయితే, మిగతా స్టోర్ల కంటే డీమార్ట్ మాత్రమే చౌకగా వస్తువులు అందించడం ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. అయితే, డీమార్ట్ డిస్కౌంట్ల(D Mart Discounts) వెనుక ఉన్న విజయ రహస్యమేంటో తెలుసా? ఇది చదివేయండి.
D Mart | సిసలైన పెట్టుబడిదారు ధమానీ
రాధాకిషన్ ధమానీ అంటేనే స్టాక్ మార్కెట్(Stock Market)లో పెట్టుబడులు పెట్టే వారందరికీ సుపరిచతమే. విజయవంతమైన ఇన్వెస్టర్(Investor)గా ఆయన పేరు గాంచారు. మార్కెట్లు బేరిష్‌గా ఉన్న సమయంలోనూ వివిధ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందడం ధమానీ ప్రత్యేకత. ఆయన స్థాపించిన డీమార్ట్(D Mart) కూడా అంతే విజయవంతంగా నడుస్తోంది. ఈ సంస్థ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు పరిచయం అక్కర్లేని పేరిది. వీకెండ్‌లో అయితే డీమార్ట్ జాతరను తలపిస్తుంది. పైగా, జన సాంధ్రత తక్కువగా ఉండే ప్రాంతంలో డీమార్ట్ స్టోర్(D Mart Store)ను స్థాపిస్తుంటారు. తద్వారా ఆ ప్రాంతంలో భూముల ధరలు, అద్దె రేట్లు సహజంగానే పెరుగుతుంటాయి. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన డీమార్ట్ ఇప్పుడు టైర్-2 సిటీలకు కూడా విస్తరించింది. మొత్తంగా డీమార్ట్‌కు దేశవ్యాప్తంగా 415 స్టోర్లు ఉన్నాయి.
D Mart | సొంత స్థలాల్లోనే స్టోర్లు..
తక్కువ ధరలకు డీమార్ట్ పెట్టింది పేరు. అయితే, డీమార్ట్‌లో ఇంత భారీ డిస్కౌంట్(Big Discounts) ఇవ్వడం వెనుక ఉన్న స్ట్రాటజీ(Strategy) ధమానీకి మాత్రమే ప్రత్యేకం. డీమార్ట్ అధిపతి రాధాకిషన్ ధమానీ ఎక్కడా కూడా అద్దె స్థలంలో స్టోర్లు తెరవకపోవడమే అసలు కారణం. దీని వల్ల అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులు(Operating Costs) సగానికి సగం తగ్గుతుంటాయి. సొంత భూములు ఉండడంతో అద్దె బాధ కూడా లేదు. ఈ విధంగా డీమార్ట్ తన ఖర్చులలో 5-7 శాతం ఆదా చేస్తుంది. ఇలా మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్(Discount) రూపంలో ప్రజలకు అందిస్తుంది. పైగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్‌ను అందుబాటులో ఉంచడం కూడా సంస్థ మరో విజయ రహస్యం. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలన్నది వారి లక్ష్యం. నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడం ద్వారా ఆ ప్రయోజనాన్ని తన కస్టమర్లకు(Customers) అందించాలనే లక్ష్యంతో భారీగా డిస్కౌంట్ ఇస్తోంది. తక్కువ ధరకు వస్తుండడంతో వినియోగదారులు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోతుండడంతో డీమార్ట్.. తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇస్తుంటుంది. దీంతో ఆయా సంస్థలు కూడా డీమార్ట్‌కు ఎంతో కొంత డిస్కౌంట్‌పై వస్తువులను అందిస్తున్నాయి. ఈ తగ్గింపును కూడా డీమార్ట్ ప్రజలకు డిస్కౌంట్ల రూపంలో ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. ఇదే డీమార్ట్ వెనుక ఉన్న విజయ రహస్యం.