అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea | రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలు, సొసైటీలకు పరుగులు తీస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోవడంతో సొసైటీల వద్ద బారులు తీస్తున్నారు. లైన్లలో చెప్పులు, పాస్‌బుక్కులు పెట్టి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswhara Rao) కేంద్రానికి లేఖ రాశారు.
రాష్ట్రానికి యూరియా కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటాను కేంద్రం నిర్దేశిస్తే ఇప్పటివరకు 3.06 లక్షలు మాత్రమే వచ్చిందన్నారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని ఆయన లేఖలో కోరారు. కాగా యూరియా సరఫరాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని డీకే అరుణ సూచించారు.