అక్షరటుడే, వెబ్డెస్క్: Bangladesh Former PM | బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (International Crimes Tribunal) బుధవారం జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కార కేసులో ఆర్నెళ్ల జైలు శిక్ష విధిస్తూ ఐసీటీ ఛైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మోజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిరసనకారుల తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న షేక్ హసీనా(Sheikh Hasina).. ఆ దేశాన్ని వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న ఆమెను దోషిగా నిర్ధారించడం ఇదే మొదటిసారి. దేశంలో తిరుగుబాటును, నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారనే అభియోగాలపై ఐసీటీ విచారణ జరుపుతోంది.
Bangladesh Former PM | ఉక్కుపాదంతో నిరసనల అణచివేత
హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024 జూన్ మాసంలో మొదలై ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు మిన్నంటాయి. నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన మూడు నెలల వ్యవధిలోనే 1400 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో షేక్ హసీనా 2024 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఇండియా(India)లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, నిరసనకారులపై క్రూరమైన అణిచివేతకు పాల్పడ్డారని, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని షేక్ హసీనాపై ఐసీటీ(ICT) అభియోగం మోపింది. ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆమెను ప్రేరేపకురాలిగా పేర్కొంది. దీంతో హసీనాకు ఆర్నెళ్ల జైలుశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇదే కేసులో హసీనాతో పాటు గైబంధలోని గోబిందగంజ్కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్కు కూడా రెండు నెలల జైలు శిక్ష విధించింది.