అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rishab Pant | భారత వికెట్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితులలో అయిన అవలీలగా షాట్స్ ఆడుతూ టీమిండియాకు విజయాలు అందిస్తుంటాడు. అయితే నూతన ఏడాది తన తల్లి, చెల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీఎండబ్ల్యూ కారు(BMW Car)లో ఒంటరిగా బయలు దేరిన రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident)లో కొన్నాళ్ల పాటు బెడ్‌కే పరిమితమైన విషయం మనందరికీ తెలిసిందే. నిజంగా ఆయన మృత్యువును జయించి తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు.
రీఎంట్రీ తర్వాత టీమిండియా స్టార్ వికెట్ కీపర్, టెస్ట్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(Rishab Pant) మెరుపులు మెరిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ సిరీస్‌లో తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగిన పంత్.. ప్రత్యేక సెలెబ్రేషన్స్‌తోనూ హైలైట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ అనంతరం పిల్లి మొగ్గలు వేసి ఆనందం వ్యక్తం చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఒంటి కన్నుతో సిగ్నేచర్ సెలెబ్రేషన్ చేశాడు. అయితే పంత్ ఈ తరహా జిమ్నాస్టిక్ స్టైల్ సెలెబ్రేషన్స్(Gymnastics Style Celebrations) చేయడంపై అతనికి చికిత్స చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా అభ్యంతరం వ్యక్తం చేశారు.
“రిషభ్ పిల్లి మొగ్గలు వేయడం అనవసరం. అతను జిమ్నాస్టిక్‌లో శిక్షణ పొందినవాడు. శరీరంగా లావుగా కనిపించినా అతనిలో మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ గతంలో అతని శరీరానికి జరిగిన గాయాల నేపథ్యంలో ఇటువంటి స్టంట్లు ఎప్పుడూ ప్రమాదకరమే. అవి చేయాల్సిన అవసరం లేదు. ప్రమాదం తర్వాత అతని శరీరం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా కుడి మోకాలిపై భారీ సర్జరీ(Major Surgery) జరిగిందని డాక్టర్ దిన్షా వెల్లడించారు. అతని కారుకు మంటలు అంటుకోవడం వలన, మెడ నుంచి మోకాళ్ల వరకు చర్మం ఊడిపోయింది. పంత్ కుడికాలికి రక్తప్రసరణ జరగడం వలన పెద్ద ప్రమాదం తప్పింది, లేదంటే ఆ పరిస్థితుల్లో కాలును తొలగించాల్సి వచ్చేది. అదృష్టం వల్లే అతను ప్రాణాలతో బయటపడ్డాడు అని డాక్టర్ వివరించారు.