అక్షరటుడే, వెబ్‌డెస్క్:Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ముసురు పట్టినట్లు రోజంతా చినుకులు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మాధాహ్నం, రాత్రి వేళల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.
Weather Updates | ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్(Hyderabad city) నగరంలో రెండు రోజులుగా సాయంత్రం కాగానే వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. నగరవాసులు కార్యాలయాలు, విద్యా సంస్థల నుంచి ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం ప్రారంభం అవుతోంది. సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో రెండు రోజులుగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం సైతం నగరంలో వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే సాయంత్రం వరకు చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి పూట మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు.