అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ జ్యుడీషియల్ పోస్టుల భర్తీ, పదోన్నతుల ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలులోకి తీసుకొచ్చింది. సామాజిక న్యాయం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. నాన్ జ్యుడీషియల్ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఇలా రిజర్వేషన్లు(Reservations) అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇది ఇతర ప్రభుత్వ సంస్థలు, అనేక హైకోర్టులతో జత చేయబడింది.
Supreme Court | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు..
సుప్రీంకోర్టు(Supreme Court) సిబ్బంది నియామకాల్లో ఇక నుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. జూన్ 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రిజర్వేషన్ విధానం అమలును వివరిస్తూ సుప్రీంకోర్టు జూన్ 24న సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 15 శాతం పోస్టులు ఎస్సీ, 7.5 శాతం పోస్టులు ఎస్టీ అభ్యర్థులకు(ST Candidates) రిజర్వ్ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్(Administrative), సపోర్ట్ స్టాఫ్(Support Staff) స్థానాలకు రిజర్వేషన్లు కచ్చితంగా వర్తిస్తాయి. అయితే, న్యాయమూర్తుల నియామకాలకు మాత్రం వర్తించవు. ఈ విధానం ద్వారా ప్రభావితమైన పోస్టులలో రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, జూనియర్ కోర్ట్ అటెండెంట్, ఛాంబర్ అటెండెంట్, ఇతర పోస్టులకు మాత్రం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
Supreme Court | చారిత్రక సంస్కరణ
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వారసుడు, సమ్మిళితత్వానికి నిబద్ధతకు పేరుగాంచిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు చారిత్రక సంస్కరణకు తెర లేపింది. నాన్ జ్యుడీషియర్ విభాగంలో రిజర్వేషన్ల అమలులో చీఫ్ జస్టిస్ గవాయ్(Chief Justice Gavai) కీలక పాత్ర పోషించారు. “ఇతర ప్రభుత్వ సంస్థలు, అనేక హైకోర్టులలో ఇప్పటికే SC-ST రిజర్వేషన్లు అమలులో ఉంటే, సుప్రీంకోర్టు ఎందుకు మినహాయింపుగా ఉండాలి? మా తీర్పులు చాలా కాలంగా నిశ్చయాత్మక చర్యకు మద్దతు ఇచ్చాయి. మా పరిపాలనలో ఆ సూత్రాన్ని ప్రతిబింబించే సమయం ఇది” అని CJI గవాయ్ పేర్కొన్నారు.