అక్షరటుడే, వెబ్‌డెస్క్:Thailand PM | ఫోన్ కాల్ లీకేజీతో మరో ప్రధాని తమ పదవిని కోల్పోయారు. థాయిలాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా(Phatthongthaeng Shinawatra)ను ఆమె విధుల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ దేశం మరోసారి రాజకీయ తుఫానులో చిక్కుకుంది. కంబోడియా నాయకుడితో లీక్ అయిన ఫోన్ కాల్‌కు సంబంధించిన నైతిక ఫిర్యాదును విచారించిన న్యాయస్థానం 7-2 ఓట్ల తేడాతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నిరసనలు, రాజీనామాలు, అస్థిరతకు దారితీసింది.
Thailand PM | నియమావళిని ఉల్లంఘించినందుకు..
నైతిక నియమావళిని ఉల్లంఘించినందుకు థాయిలాండ్ ప్రధాన మంత్రిని సస్పెండ్ చేయడం ఏడాది వ్యవధిలోనే ఇది రెండోసారి. అంతకు ముందు శ్రేత్తా థావిసిన్(Shretta Thawisin) కూడా ఆగస్టు 2024లో ఇలాగూ సస్పెండ్‌కు గురయ్యారు. థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ నాయకుడు – ప్రస్తుత ప్రధాన మంత్రి హున్ మానెట్ తండ్రి – హున్ సేన్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీక్ కావడంతో థాయిలాండ్‌లో మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. కంబోడియా(Cambodia) సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పాలక సంకీర్ణంలో పగుళ్లు తీవ్రతరం కావడంతో, దేశ రాజకీయ వ్యవస్థ మరోమారు సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. మే 28న థాయిలాండ్-కంబోడియా సరిహద్దులో జరిగిన ఘోరమైన సైనిక ఘర్షణలో ఒక కంబోడియన్ సైనికుడు మరణించిన కొద్ది రోజులకే ఈ కాల్ లీక్ అయింది.
తరువాత కంబోడియన్ మీడియా విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో.. పేటోంగ్‌టార్న్ హున్ సేన్‌ను “మామ” అని పేర్కొనడం, అలాగే, సరిహద్దు ఘర్షణలో పాల్గొన్న ప్రాంతీయ థాయ్ ఆర్మీ కమాండర్(Thai Army Commander)ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం థాయిలాండ్‌లో అగ్గి రాజేసింది. ఆమె హున్ సేన్‌తో “మీకు ఏదైనా కావాలంటే, నేను దానిని చూసుకుంటాను” అని కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రధాని దేశ సార్వభౌమత్వ విషయంలో రాజీ పడ్డారని. ఒక విదేశీ ప్రభుత్వాన్ని శాంతింపజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సంప్రదాయ సెనెటర్ల బృందం కోర్టుకు ఫిర్యాదు చేయగా, రాజ్యాంగ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు.. విచారణ పూర్తయ్యే వరకు ఆమె ప్రధానమంత్రి అధికారాలన్నింటినీ తొలగిస్తున్నట్లు పేర్కొంది. తుది తీర్పు వచ్చే వరకు “పరిపాలన సమగ్రతను కాపాడాల్సిన అవసరం” ఉందని కోర్టు తన సంక్షిప్త ప్రకటనలో పేర్కొంది.
Thailand PM | కంబోడియాతో సరిహద్దు వివాదం
కంబోడియాతో పెరిగిన ఉద్రిక్తతల మధ్య థాయ్ ప్రధాని చేసిన ఫోన్ కాల్ సమయం అగ్నికి ఆజ్యం పోసింది. ముఖ్యంగా ప్రీహ్ విహార్ ఆలయానికి(Preah Vihar Temple) సమీపంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి థాయ్-కంబోడియన్ మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా ఉంది.