అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court | రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ప్రైవేట్ వ్యక్తుల భూములను సైతం కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సదరు వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అక్రమ నిర్మాణల విషయంలో అధికారుల తీరుపై హైకోర్టు(High Court) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District) రాజేంద్రనగర్ మండలం ఖానామెట్‌లో తమ భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సయ్యద్ రహీమున్నీసా, మరో ఏడుగురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం వారు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోని అధికారుల ఫొటోలను ట్యాంక్‌బండ్(Tank Bund)పై ప్రదర్శించాలన్నారు.
High Court | తప్పించుకునే ధోరణి సరికాదు
పిటషన్దారుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ పేర్కొందని న్యాయమూర్తి అన్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు(GHMC Officers) చెబుతున్నారని పేర్కొన్నారు. ఇలా అధికారులు తమ పరిధి కాదంటూ తప్పించుకునే విధంగా వ్యవహరించడం సరికాదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని విచారణను వాయిదా వేశారు.