అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Uttam | నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలో (Gadwal district) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ లను పశుసంవర్ధక,యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన సందర్శించారు. జూరాల ప్రాజెక్టుకు ఏర్పడిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో (Collector office) ఏర్పాటు చేసిన ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.
Minister Uttam | భద్రంగా జూరాల ప్రాజెక్టు
జూరాల ప్రాజెక్ట్ (Jurala project) సాంకేతికంగా పూర్తి భద్రంగా ఉందని ఉత్తమ్ తెలిపారు. 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయని,తాత్కాలికంగా నాలుగు గేట్లకు రోప్ సమస్య తలెత్తినప్పటికీ,దాని వల్ల ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. గతంలో ఎన్నో భారీ వరదలను జూరాల డ్యామ్ (Jurala Dam) విజయవంతంగా ఎదుర్కొందని, ఇప్పుడు కూడా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తోందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో జరిగిన పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు తప్పిదాలను సరిచేసే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు.
Minister Uttam | సాగునీటి వ్యవస్థపైనే ఫోకస్..
అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే సాగునీటి వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇరిగేషన్ లో ఆపరేషన్ & మెయింటెన్స్ (operation & maintenance) పట్ల ప్రత్యేక దృష్టి సారించి,ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జూరాల డ్యాంపై (Jurala Dam) నుంచి భారీ వాహనాలు వెళ్లడాన్ని పూర్వంలోనే నిషేధించేలా సాంకేతిక నివేదికలు ఇచ్చినప్పటికీ,గత ప్రభుత్వ పాలనలో వాటిని పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు సమస్య తీవ్రతను గుర్తించి,జూరాల ఆవరణలో అల్టర్నేట్ రోడ్,వాహనాల వంతెన కోసం రూ.100 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా, జూరాల, మంజీరా, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) వంటి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రొటీన్ మెయింటెనెన్స్ చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ముందుగానే సాంకేతికంగా సమర్థంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
జూరాల ప్రాజెక్టును పూర్తిగా రీస్టోర్ చేసి, వాటి సామర్థ్యాన్ని పెంచే దిశగా డిసిల్టేషన్, సెడిమెంటేషన్ తొలగింపు పనులు చేపడుతున్నామన్నారు.జూరాలకు అదనంగా గ్యాంట్రీ కోసం రూ.300 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని నాలుగు టీఎంసీల వరకు (two TMC capacity) పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం రెండు టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ అవుతుంది, మిగతా రెండు టీఎంసీల సామర్థ్యం అమలు అవుతే రైతులకు గణనీయమైన లాభం చేకూరుతుందని అన్నారు.
Minister Uttam | వేగంగా తుమ్మెళ్ల, ర్యాలంపాడు, నెట్టెంపాడు పనులు
తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట రిజర్వాయర్కు (Mallammakunta reservoir) భూసేకరణ పనులను వేగవంతం చేయడమే కాకుండా, జూరాల ఎడమ కాలువ ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను (Ryalampadu reservoir works) త్వరితంగా పూర్తి చేస్తామని తెలిపారు. నెట్టెంపాడు భూసేకరణ కోసం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తామన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూ.2051 కోట్లు మంజూరు చేసి పనులను వేగంగా జరిపిస్తున్నామని, డిసెంబర్ 2025 లోపల 100% పూర్తి చేస్తామన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 11,000 మంది ఇరిగేషన్ ఇంజినీర్లను నియమించామని, ఇది ఈ ప్రభుత్వ విధేయతకు నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వ లక్ష్యం పాత ప్రాజెక్టులకు పూర్తి స్థాయి పునరుత్థానం కల్పిస్తూ, కొత్త ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమేనని స్పష్టం చేశారు. ప్రతి రైతు,ప్రతి గ్రామస్థుడు సంతోషంగా ఉండేలా, ప్రభుత్వం నీటిపారుదల శాఖ ద్వారా ఎంతో ప్రామాణికత, బాధ్యతతో పని చేస్తోందన్నారు.
Minister Uttam | తప్పుడు ప్రచారం..
జూరాల ప్రాజెక్టు (Jurala project) ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిన విశ్వసనీయ ప్రాజెక్టు అని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల మరియు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలోనూ రోజుకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పటికీ, ప్రాజెక్టు ఎంతమాత్రం నష్టాన్ని ఎదుర్కొనలేదని గుర్తు చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని,అలాంటి అసత్యాల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Krishna mohan reddy), రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.