అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake News | ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కూడా కష్టం అవుతోంది. కొందరు ఫేక్ వార్తలను (Fake News) ప్రచారం చేస్తున్నారు. నిజమైన వార్తల కంటే వేగంగా ఇవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో నకిలీ వార్తల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) సిద్ధమైంది.
Fake News | ఏడేళ్ల జైలు శిక్ష
నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతేగాకుండా పలు పార్టీల సోషల్ మీడియా (Social Media) వింగ్‌లు కూడా ఫేక్ వార్తలను ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకు రాబోతుంది. నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది చట్ట రూపం దాల్చితే ఫేక్ రాయుళ్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
Fake News | ప్రత్యేక కోర్టుల ఏర్పాటు
తప్పుడు వార్తలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు (Special Courts) సైతం ఏర్పాటు చేయనున్నారు. అంతేగాకుండా ఈ కోర్టులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ యోచిస్తోంది. దీంతో నకిలీ వార్తలు వ్యాప్తి చేసే వారికి త్వరగా శిక్ష పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వారం క్రితం ఈ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టారు. త్వరలోనే ఇది చట్టరూపం దాల్చనుంది.
Fake News | రాష్ట్రంలోనూ అమలు చేయాలి
దేశవ్యాప్తంగా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తెలంగాణ (Telangana)లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కూడా నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి చట్టం తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) ఫేక్ వార్తలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. దీనికోసం అవసరమైతే చట్టం కూడా తెస్తామన్నారు. దీంతో రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.