అక్షరటుడే, వెబ్‌డెస్క్: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) వచ్చే నెల నుంచి అడ్వాన్స్ క్లెయిమ్స్(అసాక్) ఆటో-సెటిల్మెంట్(Auto-settlement) పరిమితిని ప్రస్తుతమున్న రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచనుంది. ఇది మాన్యువల్ వెరిఫికేషన్(Manual Verification) అవసరం లేకుండానే మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సీబీటీ(CBT) మేలో జరిగే సమావేశంలో ఈపీఎఫ్‌వో చందాదారులకు గణనీయమైన ఉపశమనం కల్పిస్తూ ఆమోదం మంజూరు చేస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం దాదాపు 7.4 కోట్ల యాక్టివ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
EPFO | గతంలో రూ.50 వేలే..
గతంలో అడ్వాన్స్ క్లెయిమ్‌ల(Advance claims) పరిమితి రూ.50 వేలు మాత్రమే ఉండేది. ఈ పరిమితిని మే 2024లో నుంచి రూ. లక్షకు పెంచారు. దీని ఫలితంగా ఈపీఎఫ్‌వో(EPFO) సభ్యులకు జీవన సౌలభ్యం మెరుగుపడిందని అధికారులు తెలిపారు. ఆటో-సెటిల్మెంట్(Auto-settlement) క్లెయిమ్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 మిలియన్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం దాదాపు 20 మిలియన్లకు పెరిగాయి. గత మార్చిలో జరిగిన సీబీటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అసాక్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది.
EPFO | ఏటీఎంల ద్వారా విత్‌డ్రాకు అవకాశం..
ఈపీఎఫ్‌వో తన చందాదారులకు అనేక వసతులు అందుబాటులోకి తీసుకొస్తోంది. జూన్ నుంచి ఏటీఎంలు, యూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌ల ఉపసంహరణకు సీబీటీ ఆమోదం తెలిపనుందని సంబంధిత అధికారి తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ ప్లాట్‌ఫాంల(UPI platforms) ద్వారా ఆటో-క్లెయిమ్(Advance claim) సెటిల్మెంట్ను అనుమతించడానికి ఫ్రేమ్ వర్క్ రూపొందించిందని వెల్లడించారు.