అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకును చెరువులో తోసేసి తానూ సూసైడ్ చేసుకుంది.
కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాచమొల్ల స్రవంతి(24) శుక్రవారం సాయంత్రం ఇంట్లో గొడవ పడి నాలుగేళ్ల కొడుకు రుద్రేష్, ఏడేళ్ల కూతురు శ్రీవల్లితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చిన్నమల్లారెడ్డి గ్రామ చెరువు వద్దకు రాగానే కూతురు తప్పించుకుని పారిపోయింది.
నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే రుద్రేష్ బతికే ఉన్నాడన్న ఆశతో జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబంలో గొడవలే ఆత్మహత్యకు కారణమా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.