అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu | రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. సాధారణ పౌరులు చట్టాన్ని అతిక్రమించి తప్పులు చేస్తుంటారు. మరి, చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన పోలీసులే దానిని అతిక్రమిస్తే.. తమిళనాడు(Tamil Nadu)లో అదే జరిగింది. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తూ ఏకంగా అక్కడి ఆర్టీసీ బస్సును(RTC Bus) ఢీకొన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సదరు వీడియోలో ట్రాఫిక్ పోలీసులే (Traffic Police) రాంగ్‌రూట్‌లో మహీంద్రా బొలెరోలో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తప్పు అని తెలిసి కూడా రాంగ్‌రూట్ వన్-వేలో వేగంగా దూసుకెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. అధికారం తమ చేతుల్లోనే ఉందనే పొగరుబోతు తనంతో వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యారు. బస్సును ఢీకొని తమ వాహనాన్ని చేజేతులారా దెబ్బతీసుకోవడమే కాకుండా, అందరి దృష్టిలో అల్లరిపాలయ్యారు.
ఈ ఘటన చెన్నైకి ఉత్తరాన, తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రహదారిలో జరిగినట్లు భావిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియోలో.. ఎదురుగా వాహనాలు వస్తున్నా లెక్కచేయకుండా బొలెరో బస్సును ఢీకొట్టే వరకు వేగంగా వెళుతూనే ఉంది.
TNRTC బస్సు డ్రైవర్ తప్పు అయితే ఇందులో ఏమాత్రం కనబడటం లేదు. బొలెరో డ్రైవరే(Bolero driver) నిర్లక్ష్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతూ నడిపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సర్వీసు రోడ్డులో వెళ్తున్న ఒకరు తన సెల్‌ఫోన్లో రికార్డు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. దీంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిన వారే తప్పుడు దారిలో వెళ్తే ఎలా? అని నిలదీస్తున్నారు.
https://www.instagram.com/reel/DKH31Dpz97y/?utm_source=ig_web_copy_link