అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gujarat Bridge Collapsed | గుజరాత్(Gujrat)లో వంతెన కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వడోదరలోని పద్రా తాలూకా గంభీర-ముజ్‌పూర్ వంతెన బుధవారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే. వంతెన కూలడంతో పలు వాహనాలు మహిసాగర్ నది(Mahisagar River)లో పడిపోయాయి.
వడోదర-ఆనంద్ పట్టణాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక బొలెరో, ఒక పికప్ వ్యాన్ నదిలో పడిపోయాయి. బ్రిడ్జి కూలిపోవడంతో(Bridge Collapsed) ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. నదిలో వాహనాలు పడిపోవడంతో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని కాపాడారు. అయితే అప్పటికే కొందరు నదిలో గల్లంతయ్యారు.
వాహనాలు నదిలో పడటానికి ముందు పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నదిలో పడిపోయిన వారికోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Gujarat Bridge Collapsed | దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
గుజరాత్‌లోని వడోదర జిల్లా(Vadodara district)లో వంతెన కూలిపోవడంపై ప్రధాని మోదీ(Prime Minister Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం తీవ్ర బాధాకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందిస్తామన్నారు.