అక్షరటుడే, వెబ్‌డెస్క్ :RSS Chief | రాష్ట్రీయ స్వయం సేకవ్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
75 ఏళ్లు నిండిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. నిర్దేశిత వయస్సు పడిన తర్వాత ఇక ఆగిపోయి, ఇతరులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. నాగ్‌పూర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.
RSS Chief | పింగ్లీ వ్యాఖ్యల పునరుద్ఘాటన..
దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లీ (RSS Ideologue Moropant Pingli) గతంలో చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. 75 సంవత్సరాలు పడ్డాయంటే, ఇక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నట్లేనని, ఆ సమయంలో పక్కన తప్పుకుని ఇతరులను అవకాశమివ్వాలని పింగ్లీ చేసిన వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
“మీకు 75 సంవత్సరాలు నిండినప్పుడు, మీరు ఆగిపోవాలి. ఇతరులకు దారి ఇవ్వాలని” మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. పింగ్లీ స్వభావం చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా గుర్తు చేసుకున్నారు. “75 ఏళ్లు నిండిన తర్వాత శాలువాతో సత్కరిస్తే, మీరు ఇప్పుడే ఆపాలి, మీరు వృద్ధులు, పక్కకు తప్పుకుని ఇతరులను లోపలికి రానివ్వండి” అని మోరోపంత్ పింగ్లీ ఒకసారి తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. మోరోపంత్ జాతీయ సేవ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ, వయస్సు సమయం ఆసన్నమైందని సూచించిన తర్వాత మర్యాదగా వెనక్కి తగ్గాలని నమ్మేవాడని ఆయన అన్నారు.
RSS Chief | మోదీ తప్పుకుంటారా?
ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ వయస్సు విషయంలో స్పష్టమైన విధానంతో ఉంది. 75వ వడిలోకి అడుగిడిన తర్వాత తప్పుకోవాలన్న విధానాన్ని ఎన్నో సంవత్సరాలుగా అమలు చేస్తోంది. గతంలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలను అందుకే పక్కన పెట్టింది.
2014లో బీజేపీ అధికారంలోకి రాగా, ప్రధానిగా అద్వానీ బాధ్యతలు చేపడతారని భావించారు. కానీ ఆయన వయస్సు రీత్యా సంఘ్ సమ్మతించలేదు. ఎన్నికలకు ముందు నుంచే మోదీ(Modi)ని భావి ప్రధానిగా తెరపైకి తీసుకొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తర్వాత మోదీని ప్రధానిగా చేసింది. అయితే, వచ్చే సెప్టెంబర్ మాసంతో ప్రధానమంత్రి 75 సంవత్సరాలు నిండుతాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్ఎస్ఎస్ విధానానికి అనుగుణంగా మోదీ తప్పుకుంటారా? లేక పదవిలో పూర్తికాలం కొనసాగుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భగవత్‌కు కూడా సెప్టెంబర్‌లోనే 75 ఏళ్లు పడుతాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా తప్పుకుని ఇతరులకు అవకాశం కల్పిస్తారా? అన్నది చర్చ జరుగుతోంది.
RSS Chief | విపక్షాల విమర్శలు..
75 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనే మోహన్ భగవత్ వ్యాఖ్యలు విపక్షాలకు మంచి అస్త్రం అందించినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. గతంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని 75 ఏళ్లకు తప్పుకోవాలని మోదీ ఒత్తిడి చేశాడని, మరీ ఇప్పుడు ఆయన కూడా తప్పుకుంటారో లేదో చూడాలని శివసేన (యుబిటి) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (Rajya Sabha member Sanjay Raut) అన్నారు. “ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేయమని మోదీ బలవంతం చేశారు. ఇప్పుడు ఆయన అదే నియమాన్ని తనకు అన్వయించుకుంటారో లేదో చూద్దాం” అని వ్యాఖ్యానించారు.