అక్షరటుడే, వెబ్డెస్క్ :Balochistan | అంతర్గత పోరుతో పాకిస్తాన్(Pakistan) అల్లాడుతోంది. వేర్పాటువాదుల దాడులతో దద్దరిల్లుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army) గెరిల్లా దాడులతో పాకిస్తాన్ కు చుక్కలు చూపుతోంది.
స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న బలూచ్ వేర్పాటువాదులు.. గత 24 గంటల్లో 50 దాడులకు పాల్పడ్డారు. 27 మందికి పైగా కాల్చి చంపగా, మరి కొందరిని కిడ్నాప్ చేశారు. సుహ్రాబ్ జిల్లా(Sohrab District)లోని గిదార్లోని సైనిక స్థావరంపై జరిగిన దాడి చేసి, 18 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారు.
Balochistan | బామ్ పేరిట దాడులు..
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్(Balochistan Liberation Front), బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర సాయుధ గ్రూపులు కలిసి ఆపరేషన్ బామ్(Operation Bam) పేరిట దాడులను ఉద్ధృతం చేశాయి. సమన్వయంతో గెరిల్లా దాడులు చేస్తున్నాయి.
గత 24 గంటల్లో 17 ప్రభుత్వ, సైనిక స్థావరాలపై దాడి చేసింది. జోబ్ ప్రాంతంలో బస్సులను తనిఖీ చేసిన వేర్పాటు వాదులు.. విధుల నుంచి తిరిగి వస్తున్న తొమ్మిది మంది పంజాబీ ప్రాంతానికి చెందిన వారిని గుర్తించి ఉరి తీశారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు. వారిని వేర్పాటు వాదులే అపహరించారని భావిస్తున్నారు.
Balochistan | ప్రావిన్స్ అంతటా విస్తృత హింస
కెచ్, ఖరన్, ఖుజ్దార్, కలత్, పంజ్గుర్, వాషుక్, ముసాఖేల్, సిబి, మస్తుంగ్, నసీరాబాద్, క్వెట్టా, చాగై, డేరా బుగ్టితో సహా దాదాపు ప్రతి జిల్లాలో బలూచ్ దాడులు జరిగాయి. పంజాబ్ కేంద్రీకృత భద్రతా కార్యకలాపాల కంటే ఎక్కువగా దాడులు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్తాన్ ఏర్పడిన నాటి బలూచ్ తిరుగుబాటు కొనసాగుతోంది. ఆ ప్రాంతంపై పాక్ పాలకులు వివక్ష చూపుతుండడం, అభివృద్ధి చేయకపోవడంతో బలూచ్ వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యవస్థాగత అణచివేత, వనరుల దోపిడీ, గ్వాదర్ పోర్ట్, సీపెక్ వంటి మెగా-మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ప్రాంత వాసులు పాక్ పై తిరుగుబాటుకు దిగారు.
2025 ప్రారంభం నుంచి దాడులను విస్తృతం చేశారు. రైలు హైజాక్లు, బాంబు దాడులతో పాకిస్తాన్ ను కలవరపెడుతున్నారు. ఖుజ్దార్, మస్తుంగ్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, తిరుగుబాటును అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం(Pakistan Government).. ఆపరేషన్ హెరాఫ్ 2.0(Operation Heref 2.0) సహా ఎన్నోసార్లు యత్నించి విఫలమైంది. జనవరిలో 27 మంది బలూచ్ యోధులను అంతమొందించింది. ఇది మరింత ఆగ్రహానికి కారణమైంది. బాంబు దాడులు, కిడ్నాప్లతో వేర్పాటువాదులు పాకిస్తాన్ పాలకులకు చుక్కలు చూపుతున్నారు.