అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gujarat Bridge Collapse | గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. వడోదరా జిల్లాలోని పద్రా వద్ద మహిసాగర్ నది(Mahisagar River)పై బుధవారం వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆనంద్‌నగర్, వడోదర(Vadodara)లను కలిపే ఈ వంతెన మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి బ్రిడ్జి కూలిపోయే వరకు కూడా అధికారులు గమనించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వంతెన కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై పలువురిని కాపాడారు. అనంతరం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే గురువారం నాటికి మృతుల సంఖ్య 15కు చేరింది. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Gujarat Bridge Collapse | కొత్త వంతెన కోసం నిధులు మంజూరు
మహిసాగర్ నదిపై వంతెన 1985లో నిర్మాణం పూర్తయింది. వంతెన పాతది కావడం.. వాహనాల రద్దీ పెరగడంతో కొత్త వంతెన నిర్మించాలని గతంలోనే అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ వంతెనపై రాకపోకలు నిషేధించాలని తాము 2017లోనే కోరినట్లు కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) చెబుతున్నారు. అయితే వంతెన పాతది కావడంతో ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని, మూడు నెలల క్రితమే రూ.212 కోట్లు మంజూరు చేశామని మంత్రి రిశికేష్ పటేల్(Minister Hrishikesh Patel) తెలిపారు. టెండర్లు కూడా మొదలయ్యాయని, అంతలోనే ప్రమాదం జరిగిందన్నారు.