అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, విలన్లు క్లైమాక్స్‌లో అరెస్టు అవుతారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ (Media Chit Chat) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విలన్లు ప్రతిసారి క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారని.. ఆ విషయంలో తనకు తొందర లేదన్నారు.
కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఇండియా – పాకిస్తాన్(India – Pakistan) మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే.. తాను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన అన్నారు.
CM Revanth Reddy | ఫామ్‌హౌస్‌కు వెళ్తే పనులు కావు
తన ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) చేస్తున్న విమర్శలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. ప్రజలు తనకు అధికారం ఇచ్చారని.. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అన్నారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్‌కు వెళ్తే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు అని పరోక్షంగా కేసీఆర్ (KCR)పై విమర్శలు చేశారు. నెలకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతానని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | గంజాయి బ్యాచ్‌కు భయపడను
తాను గంజాయి బ్యాచ్‌కు భయపడనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కేసుపై, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌తో అసెంబ్లీలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇటీవల కేటీఆర్(KTR) చర్చకు రావడంపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలు కవితే అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) తమకు వ్యూహం ఉందని ఆయన వెల్లడించారు. తాను చంద్రబాబు సమావేశం అయితే బీఆర్ఎస్ నాయకులు హంగామా చేస్తున్నారని, గతంలో కేటీఆర్, లోకేశ్‌ల మీటింగ్ సంగతేమిటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతుందని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలన్నారు.
CM Revanth Reddy | పాత పథకాలు కొనసాగుతున్నాయి
బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ మినహా పాత పథకాలు అన్ని కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంతో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖలు రాయడం మాని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు.