అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana BJP | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay), మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) మధ్య నెలకొన్న తీవ్ర వివాదం మరువక ముందే.. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. చేవేళ్ల ఎంపీ, బీజేపీ విప్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(BJP Whip Konda Vishweshwar Reddy) పార్టీ ఎంపీల కోసం మంగళవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన విందు భేటీకి ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, గోడం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పని చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ భేటీకి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
Telangana BJP | ఎంపీల భేటీకి ఎందుకు రానట్లు?
వాస్తవానికి తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీల్లో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్(MP Aravind), రఘునందన్ రావుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అంతర్గత విభేదాల కారణంగా చాలా కాలంగా అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి కోసం ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్ రావు(Raghunandan Rao)తో పాటు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నించారు. వీరి మధ్య తీవ్ర విభేదాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం.. వీరిని కాదని మరొకరిని నియమించింది. ఎలాంటి వివాదాస్పదం కాని, అందరితో కలివిడిగా ఉండే రాంచందర్ రావును అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. ఈ నిర్ణయం అధ్యక్ష పదవి ఆశించిన ఎంపీల మధ్య మరింత దూరం పెంచింది. మిగతా వారి వల్లే తనకు పీఠం దక్కలేదన్న భావన ఆశావహుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విందు భేటీ ఏర్పాటు చేశారు. కానీ, ఈ సమావేశానికి ఇద్దరు కేంద్ర మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.
Telangana BJP | కలవరంలో కాషాయ శ్రేణులు..
కొంత కాలంగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కాషాయ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో పాటు ముఖ్య నేతల మధ్య బహిరంగంగానే పొడిసూపిన విభేదాలు కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఎంపీలంతా ఏకతాటిపైనే ఉన్నారన్న భావనను చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన విందు భేటీకి ముఖ్య నేతలు గైర్హాజరు కావడంతో మరోసారి విభేదాలు బయటకు వచ్చాయన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీకి మంచి అవకాశముందని, ఇలాంటి తరుణంలో అంతర్గత పోరు మంచిది కాదని కాషాయ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరింత నష్టం జరుగక ముందే జాతీయ నాయకత్వం వెంటనే స్పందించి నేతల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు.