అక్షరటుడే, ముంబై: Ultraviolette F77 | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ముందున్న అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్77 (F77) మోటార్‌సైకిల్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. ఈ బైక్‌కు ‘జనరేషన్ 3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్’తో పాటు, ‘బాలిస్టిక్+’ అనే వినూత్న ఫీచర్‌ను జోడించింది.
దీంతో ఎఫ్77 ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, వేగంగా, రైడింగ్‌లో అదనపు థ్రిల్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గతేడాది విడుదలైన ఎఫ్77 మాక్ 2 మోడల్‌లో ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, పది స్థాయిల రీజనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, వయోలెట్ ఏఐ వంటి భద్రతా ఫీచర్లను అందించారు. ఇప్పుడు, 80 లక్షల కిలోమీటర్లకు పైగా బైక్‌ల రైడింగ్ డేటాను విశ్లేషించిన తర్వాత, ఈ కొత్త అప్‌డేట్‌లను విడుదల చేశారు.
అల్ట్రావైలెట్ సీఈవో, సహ-వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియమ్ (Narayan Subramaniam) మాట్లాడుతూ.. “సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడే కొద్దీ వాటి సామర్థ్యం తగ్గుతుందనే భావన ఉంటుంది. అయితే, మేము దీనికి భిన్నంగా ఆలోచిస్తాం. మా టెక్నాలజీ కాలక్రమేణా మరింత మెరుగుపడుతుంది. అంటే, మీరు మా బైక్‌ను ఎంత ఎక్కువ కాలం ఉపయోగిస్తే, అది అంతకు మించి శక్తిని అందిస్తుంది. ఒక బైక్ వినియోగదారుల నుంచి నేర్చుకుంటూ, వారితో పాటు ఎదుగుతూ, వారికి మెరుగైన పనితీరును ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం” అని వివరించారు. ‘బాలిస్టిక్+’ ఫీచర్ బైక్ రైడింగ్ అనుభవాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచి, బైక్‌కు మరింత వేగం, ప్రారంభ శక్తిని అందిస్తుంది.
ఈ ఫీచర్‌కు వయోలెట్ ఏఐ (Violette AI) అనే కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కీలకం. వయోలెట్ ఏఐ కేవలం బైక్‌ను పర్యవేక్షించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సేకరించిన నిజ-సమయ రైడింగ్ డేటా(Riding Data)ను (ఎలా నడుపుతున్నారు, యాక్సిలరేటర్ ఎలా వాడుతున్నారు, వివిధ రైడింగ్ పరిస్థితులు) చురుకుగా విశ్లేషిస్తుంది.
అల్ట్రావైలెట్ సీటీవో, సహ-వ్యవస్థాపకుడు నీరజ్ రాజ్‌మోహన్ (Neeraj Rajmohan) మాట్లాడుతూ, “ప్రతి ఎఫ్77 బైక్‌లో ‘వెహికల్ కంట్రోల్ యూనిట్’ (VCU) అనే శక్తివంతమైన ఆన్‌బోర్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది. ఇది ఒకేసారి 3,000కు పైగా డేటా పాయింట్లను గుర్తించగలదు. వయోలెట్ ఏఐ ఈ డేటాను నిరంతరం విశ్లేషించి, బైక్ పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ అధునాతన హార్డ్‌వేర్, ఇంటెలిజెన్స్ అనుసంధానం ద్వారా, బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్‌ల నుంచి మరింత ఎక్కువ పనితీరును సాధించగలిగాం. ఇది ఎలక్ట్రిక్ బైక్‌ల పనితీరులో ఒక నూతన అధ్యాయం” అని అన్నారు.ముఖ్యంగా, ఇప్పటికే ఎఫ్77 బైక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ కొత్త ‘జనరేషన్ 3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్’ను అదనపు ఖర్చు లేకుండా అల్ట్రావైలెట్ అందిస్తోంది. ‘బాలిస్టిక్+’ ఫీచర్ కూడా పాత మోడళ్లకు కూడా వర్తిస్తుంది.